Gold robbery : ఏపీలోని విజయనగరంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని గంటస్తంభం సమీపంలో ఉన్న రవి జువెలర్స్‌లో 5 కిలోల బంగారు అభరణాలను దొంగలు కాజేశారు. భవనం పైకప్పు నుంచి దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణానికి మంగళవారం సెలవు కావటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దుకాణం యజమాని ఇవాళ ఉదయం షాపు తెరవగా.. ఆల్మరాల్లోని పెట్టెలు ఖాళీ ఉన్నాయి. దీంతో దోపిడీ జరిగినట్లు గుర్తించిన అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
యజమాని ఫిర్యాదుతో విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ శ్రీనివాసరావు.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మరోవైపు మరల్చి.. బంగారాన్ని దోచుకెళ్లిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చోరీ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా దొంగతనం జరిగిన రవి జువెలర్స్.. ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం.