Air Gun Misfire: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రసాద్ ఫాంహౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఒక బాలిక మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఎయిర్‌గన్ పేలి అక్కడ పనిచేస్తున్న వ్యక్తి కుమార్తె శాండ్వీ(4) తీవ్ర గాయాలపాలైంది. వెంటనే చిన్నారిని గడ్డిపోచారంలోని ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా తాను ఇలాంటివాటికి చికిత్స చేయలేనని.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాలికను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జిన్నారం ఎస్సై సిద్దిరాములు, గుమ్మడిదల ఎస్సై విజయ్ కృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారని.. ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారని పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి చెప్పారు. అసలు ఎయిర్‌గన్ ఎలా ఫైర్ అయిందనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.
ఇదీచూడండి: పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడి బొమ్మగీసి..