Gas Cylinder Exploded In Yadadri Bhuvanagiri District: మద్యం మత్తులో గ్యాస్‌స్టవ్ వెలిగించబోయి ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఒకరికి గాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరు మండలంలోని కోటమర్తి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి గ్రామానికి చెందిన పాశం యాదగిరి ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. యాదగిరి మద్యం మత్తులో వంట చేసుకునేందుకు గ్యాస్‌స్టవ్ వెలిగించడంతోనే గ్యాస్ లీకై ఈ ఘటన చోటుచేసుకుందని గ్రామస్థులు తెలిపారు.

ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారంతా లేచి చూడగా ఇంటి గోడలు, పైకప్పు స్లాబ్ పగిలి గోడ శిథిలాలు బయటపడ్డాయి. యాదగిరి తల్లి పక్కింట్లో పడుకోవడంతో ప్రాణాలతో బయట పడింది. ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా సుమారు రూ.10లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి రాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రునికి తీవ్ర గాయాలై, సగానికి పైగా శరీరం కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం పోలీసులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: