కొవిడ్ సమయంలో ప్రాణవాయువు అవసరం చాలా ఉంటుంది. సరిగ్గా ఇదే అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్సి సంస్థలు, సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వేర్వేరు పరిమాణాలు ఉన్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఒకే ధరకు విక్రయించిన సంస్థ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాణవాయువు పరికరాలు తక్కువ ధరకే ఇస్తామంటూ సైబర్ మోసగాళ్లు... వ్యక్తులు, కంపెనీలను మోసం చేస్తున్నారు.
పోలీసుల గాలింపు
రంగారెడ్డి జిల్లా దేవరయాంజిల్‌లోని జీఏ అనే సంస్థ లిబర్టీ క్రాస్ రోడ్‌లోని ఓ కంపెనీని మోసం చేసింది. 2వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లకు రూ.13.80 కోట్లు వసూలు చేసుకుని వేర్వేరు పరిమాణాలు ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడంతో బాధిత కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వ్యవహారంపై సాక్ష్యాధాధారాలను సేకరిస్తున్నారు. మరోవైపు కాన్సన్‌ట్రేటర్ల పేరుతో దోచుకుంటున్న కేటుగాళ్లను సైబర్ క్రైం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి.
భిన్న సైజుల్లో పరికరాలు
ప్రాణవాయువు పరికరాలు ఇప్పిస్తామంటూ లిబర్టీ క్రాస్ రోడ్‌లోని ఓ కంపెనీ రెండేళ్ల నుంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వేర్వేరు సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. కరోనా వైరస్ రెండో దశ నేపథ్యంలో వీటి గిరాకీ పెరిగింది. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని లిబర్టీ క్రాస్ రోడ్ కంపెనీ ప్రతినిధులు తెలుసుకున్నారు. మే తొలివారంలో జీఏ సంస్థతో మాట్లాడి 2వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందుకు రూ.6.90 కోట్లు అడ్వాన్సు ఇస్తే... వారు 500 పరికరాలు ఇచ్చారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనంతరం మరో 25 రోజుల్లో దశల వారీగా రూ.6.90 కోట్లు జీఏ సంస్థకు చెల్లించినట్లు పేర్కొన్నారు.
సంస్థలూ మోసాలు
విమానాశ్రయాల్లో కార్గో సంస్థ కారణంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు చెన్నైకి వచ్చాయంటూ జీఏ సంస్థ చెప్పడంతో లిబర్టీ క్రాస్ రోడ్ కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి వాటిని తీసుకొచ్చారు. కాగా 750 పరికరాల కొలతలు వేరుగా ఉన్నట్లు వారు గుర్తించారు. ఇదే విషయమై ప్రశ్నించగా... అవి తప్పుగా ఉన్నాయని చెప్పారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కానీ వాటిని మార్చేందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అవసరమే ఆసరా
కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ప్రాణవాయువుల పరికరాలు లభించక... బాధితులు సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థించారు. ఇదే ఆసరాగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు... తక్కువ ధరకే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఇస్తామంటూ ఫోన్ చేసి రూ.35 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. నిందితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఫార్మా కంపెనీల ప్రతినిధుల్లాగా పరిచయం చేసుకొని మాట్లాడారని బాధితులు తెలిపారు. ఏప్రిల్ చివరి వారం నుంచి మూడు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మోసపోయారని పోలీసులు తెలిపారు. తమ వద్ద 12 కేసులు నమోదు కాగా.. ఇందులో బెంగళూరు కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
ఇదీ చదవండి: cm kcr: 'ప్రజా రక్షణకు అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి'