బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించాడు. ఆపై రైతు బీమాకు దరఖాస్తు చేసి వచ్చిన 5 లక్షల రూపాయలను కుటుంబసభ్యులకు తెలియకుండా కాజేశాడో మోసగాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామానికి రైతుబంధు కోఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ చనిపోయిందని నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. ఆ పత్రాలతో రైతు బీమాకు దరఖాస్తు చేశాడు.
చంద్రమ్మ కుమారుడు బాలయ్యకు మాయమాటలు చెప్పి రైతు బీమా కింద వచ్చిన 5 లక్షలను కాజేశాడు. తన తల్లి చంద్రమ్మ రైతు బంధు పైసలు పడలేదని... బాలయ్య అధికారులను ఆశ్రయించాడు. చంద్రమ్మ చనిపోయినందుకు రైతుబీమా డబ్బులు ఖాతాలో పడిందని వ్యవసాయశాఖ అధికారులు సమాధానం ఇవ్వడంతో బాలయ్య కంగుతిన్నాడు. బతికున్న తన తల్లి చనిపోయిందనడమేంటని అధికారులు నిలదీశాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో... కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పంటనష్టం పేరిట పత్రాలపై సంతకాలు పెట్టించాడని.. ఎవరివో తన అకౌంట్‌లో డబ్బులు పడ్డాయని చెప్పి తన అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నాడని బాలయ్య చెబుతున్నాడు. పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు.. పై అధికారులకు తప్పుడు నివేదిక సమర్పించినట్లు గుర్తించారు. రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ రాఘవేందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మోసం చేశాడు..
పంట నష్టం డబ్బులు అని చెప్పి సంతకం పెట్టించుకుని ఇలా మోసం చేశాడు. రైతుబంధు పడడం లేదని ఆఫీసుకు పోతే ఇదంతా బయటపడింది. మా అమ్మ పేరు మీద రైతు బీమా పడిందని సార్ చెప్పిండు. మీ అమ్మ చనిపోయిందని రైతుబీమా వచ్చిందిగా... అని అన్నాడు. -బాలయ్య, చంద్రమ్మ కుమారుడు
ఇదీ చదవండి: దారుణం: భార్య, కుమార్తెను హత్య చేసిన భర్త