ఏపీలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాల పర్వం కొనసాగుతూనే ఉంది. రోజు ఏదో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 15 ఏళ్ల బాలికపై నలుగురు మానవమృగాలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీ సత్య సాయి జిల్లా తలుపుల మండలంలో పశువుల కాపరిగా వెళ్లే 15 ఏళ్ల బాలికను బెదిరించి నలుగురు కామాంధులు.. ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన బాలిక ఆవులను మేపేందుకు అడవికి వెళ్లేది. ఒంటరిగా ఉన్న బాలికను చూసిన మేకల కాపరి కుమార్ ఓ రోజు బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, నరేంద్ర, సురేష్ ఒకరికి తెలియకుండా మరొకరు బాలికను బెదిరిస్తూ... ఏడాదిగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నారు.
బాలికకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అనుమానం కలిగిన తల్లి కుమార్తెను అడిగింది. బాలిక... జరిగిన దారుణాన్ని తల్లికి తెలిపింది. తమ కుమార్తెపై దారుణానికి ఒడిగట్టిన వారిని చట్టపరంగా శిక్షించాలంటూ... ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శరత్ చంద్ర తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన నలుగురులో ముగ్గురు ఆమెకు వరసకు సోదరులవుతారని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: