Road accident at menur: కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు. మద్నూరు మండలం మేనూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే రాంగ్ రూట్‌లో వచ్చిన ఆటో.. లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జయింది.
ప్రమాదం జరిగిందిలా..: కంటైనర్ లారీ హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తోంది. మరోవైపు ఆటో మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో వస్తోంది. ఈ క్రమంలోనే అదుపుతప్పిన ఆటో.. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనలో మేనూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి కృష్ణ(17) మద్నూర్ జూనియర్ కళాశాల నుంచి మేనూరుకు రెండు నిమిషాల్లో చేరుకుంటాననగా మృత్యు ఒడికి చేరారు. అలాగే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి సమీపంలోని బాంలికి చెందిన మహాజన్ (50)గా పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో ఊహించని ట్విస్ట్: రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఘోర ప్రమాదానికి గురైన ఆటో అంతకుముందే చోరీకి గురైనట్లు కేసు నమోదైనట్లు తేలింది. ఇవాళ ఉదయం రుద్రూర్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఆటోను ఎత్తుకెళ్లిన దొంగలు ప్రమాదానికి గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాద్ వాసుల మృతి
అమరావతిలో ఘోరం.. బ్రిడ్జ్‌పై నుంచి పడిన కారు, బైక్.. ఆరుగురు మృతి