Four People Died In Krishna District: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బంటుమిల్లిలో విషాదం చోటుచేసుకుంది. నేలబావిలో పూడిక తీసేందుకు దిగి.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చాలా రోజులుగా వినియోగించని బావి కావడంతో విషవాయువులు వ్యాప్తి చెంది.. ఊపిరి తీసుకోలేక మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చనిపోయిన వారిలో తండ్రీకుమారుడితో పాటు ఇంటి యజమాని, అతని సహాయకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు వంజుల రామారావు, లక్ష్మణరావు, కొండా రంగా, పుప్పాల శ్రీనివాసరావుగా గుర్తించారు.
కొండా రంగా నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ నేల బావి చాలా రోజులుగా పూడిపోయింది. పక్క నుంచి మురుగునీటి కాలువ వెళ్తోంది. ఇటీవల వర్షాలకు నేలబావి వద్ద నీరు నిలిచిపోతుండటంతో.. నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల పరిరక్షణ కోసం బావిలోని పూడికతీసి శుభ్రం చేయాలని రంగా భావించినట్లు పోలీసులు చెబుతున్నారు.
పూడిక తీసేందుకు బంటుమల్లికి చెందిన తండ్రీకొడుకులు వంజుల రామారావు, లక్ష్మణరావుకు పని అప్పగించారు. సాయంత్రం నాలుగు గంటలకు బావి పూడిక తీస్తున్న సమయంలో రంగా, మూలపర్రుకు చెందిన మరో వ్యక్తి శ్రీనివాసరావు బావిలోకి దిగారు. నలుగురూ ఊపిరి తీసుకోలేక బావిలోకి దిగిన కొద్దిసేపటికే సొమ్మసిల్లిపడి.. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
విష వాయువుల వల్ల ప్రాణవాయువు తీసుకోలేక మృతి చెంది ఉంటారని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. మృతదేహాలను నేలబావి నుంచి బయటకు తీయించి.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: