Karimnagar Car Accident : పొట్టకూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అభాగ్యుల బతుకులు అంతలోనే తెల్లారాయి. రోడ్డుపక్కన పని చేసుకుంటూ... బతుకుబండి లాగుతున్న ఆ కూలీల జీవితాలు రోడ్డు ప్రమాదంతోనే ముగిసిపోయాయి. యమపాశంలా దూసుకొచ్చిన కారు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో యమకింకరుల్లా వచ్చి.... నలుగురు అమాయకుల మృతికి కారణమయ్యారు. కరీంనగర్‌లో జరిగిన ఈ ఘటన పలుకుటుంబాల్లో తీవ్రవిషాదం నింపింది.
ఎలా జరిగింది?
Car Accident Update : కరీంనగర్ నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు సృష్టించిన బీభత్సంతో... నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నగరంలోని కమాన్ సమీపంలో కరీంనగర్-హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన కొలిమి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం కావటంతో మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్లు కాల్చుకుంటూ... ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలోనే ఉదయం 7గంటల ప్రాంతంలో అటుగా దూసుకొచ్చిన కారు.... రోడ్డుపక్కన పనులు చేసుకుంటున్న కూలీలపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని హుటాహుటినా కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.... మరో ముగ్గురు మహిళలు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఫరియాద్, సునీత, లలిత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మేం పొద్దుగాల ఆరింటికే వచ్చి.. కొలిమిదగ్గర కూచున్నాం. మేం గొడ్డళ్లు, కొడవళ్లు తయారు చేస్తాం. ఓ కారు వచ్చి గుద్దింది. ఒకామె అక్కడే చనిపోయింది. మరో ముగ్గురు ఆస్పత్రిలో చనిపోయారు.
స్థానికుడు
ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు చనిపోయారు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది. మమ్మల్ని అధికారులు ఖాళీ చేయించారు. మిమ్మల్ని చాలా నిర్లక్ష్యం చేశారు. మాకు ఎక్కడన్నా స్థలాలు కేటాయించాలని మొరపెట్టుకున్నాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
-స్థానికుడు
తీరని విషాదం
Car accident today: గతంలో రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని జీవిస్తున్న ఈ కుటుంబాలను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో కోతిరాంపూర్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని... రోజు వారి పని కోసం కమాన్ ఏరియాకు తెల్లవారుజామునే వస్తుంటారు. ఈ క్రమంలోనే కారు సృష్టించిన బీభత్సానికి నలుగురు మహిళలు మృతిచెందటం వారి కుటుంబాల్లో తీవ్రవిషాదాన్ని నింపింది. అప్పటి వరకూ తమతో కలిసి పనిచేస్తున్న వారు కళ్ల ముందే విగతజీవులుగా మారటంతో... మృతుల కుటుంబసభ్యులు గుండెలు బాదుకున్నారు. ప్రమాదంలో గాయపడి... చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు
Karimnagar accident news : ప్రమాదానికి కారణమైన వ్యక్తులు.... కారును ఘటనాస్థలంలోనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ వాహనం కచ్చకాయల రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కారుపై వివిధ ప్రాంతాల్లో 9 ఓవర్‌స్పీడ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు.... ఘటనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
కరీంనగర్ కమాన్ వద్ద కమ్మరి పనులు చేసుకునేవారుంటారు. ఇవాళ ఓ కారు అతివేగంగా వచ్చి.. వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు.
-తుల శ్రీనివాసరావు, కరీంనగర్ ఏసీపీ
న్యాయం కోసం ఆందోళన
కారు బీభత్సంతో చనిపోయిన నాలుగు కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కమాన్ ప్రాంతంలో స్థానికుల రాస్తారోకో చేశారు. తెల్లవారుజామున కారు ఢీకొని నలుగురు చనిపోవటంతో కరీంనగర్-హైదరాబాద్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు నిందితుడు టోనీని ఇవాళ కూడా విచారించనున్న పోలీసులు