Secunderabad Fire Accident accused arrest: సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలంలో పోలీసు, రవాణాశాఖ, అగ్నిమాపక అధికారుల తనిఖీలు చేపట్టారు. సెల్లార్ ప్రాంతంలోని వీడియోను తీసుకెళ్లారు. జనరేటర్, సిలిండర్లు, ఈ-మోటర్స్ ఫొటోలను అధికారులు రికార్డ్ చేశారు. అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
భవనానికి ఏమేం లైసెన్సులు ఉన్నాయి, ఘటన సమయంలో ఎక్కడ ఉన్నారు.. వంటి అంశాలపై ఆరాతీస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత నలుగురు నిందితులు పరారీలో ఉండగా.. నిన్న రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంల నిర్వాహకులైన తండ్రీకుమారుడు రాజేందర్ సింగ్, సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్‌వైజర్ ఉన్నారు. నిందితుల నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
అగ్ని ప్రమాదంలో మరణించిన, క్షతగాత్రులకు సంబంధించిన వస్తువులను సీజ్ చేసి మొండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయినట్లు మరికొంతమంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారికి సంబంధించిన అన్ని వస్తువులను స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడ్డ 9 మందిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
అసలేం జరిగిందంటే: సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో కొనసాగుతోంది. మొదటి అంతస్తులో ఫైనాన్స్ సంస్థ, రిసెప్షన్ విభాగాలున్నాయి. తర్వాతి అంతస్తుల్లోని 25 గదులను అద్దెకు ఇస్తున్నారు. వాహన పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్‌లో విద్యుత్ ద్విచక్రవాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన 25 మంది 1-2 రోజులు ఉండేందుకు ఈ లాడ్జిలో బస చేశారు. సోమవారం రాత్రి 9.17 గంటలకు సెల్లార్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించి.. వాహనాలన్నీ కాలిపోయాయి. వాహనాలు, టైర్లు కాలటంతో దట్టమైన పొగ వ్యాపించింది. రెప్పపాటులో ఐదంతస్తుల్లో ఉన్న గదులను పొగ చుట్టుముట్టి లోపలున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. పొగ ధాటికి తట్టుకోలేక ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇవీ చదవండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రిక్ వాహనాలే కారణం
మంటల్లో నుంచి బయటపడలేక పోతున్నాం.. చివరిసారిగా కుటుంబంతో సికింద్రాబాద్ ఘటన మృతులు
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. సాహసవీరులారా సెల్యూట్
పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని కూలీ ఆగ్రహం- బెంజ్ కారుకు నిప్పు