ప్రశ్నించినందుకు యువకుడిని చితకబదారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్, అతని అనుచరులు. రోడ్డుపై గుంతలు తీసి ఎందుకు వదిలేశారని అడిగినందుకు ఇంట్లోకి పిలిచి మరీ తనను కొట్టారని బాధితుడు దుర్గాప్రసాద్ వాపోయారు. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానందనగర్లో చోటు చేసుకుంది.
సదరు యువకుడు ఆల్విన్కాలనీ నుంచి ఈనాడు కాలనీ మీదుగా వివేకానందనగర్ కాలనీకి వస్తుండగా... మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్‌రావు ఇంటి వద్ద రోడ్డును తవ్వి ఎలాంటి భద్రత సూచికలు లేకుండా వదిలేశారు. ఇది గమనించని దుర్గాప్రసాద్ ద్విచక్రవాహనంపై నుంచి గుంతలో పడి పోయాడు. గుంత తీసి ఇలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించడంతో ఇంట్లోకి రమ్మని పిలిచి వెంగళ్‌రావు, అతని డ్రైవర్ అశోక్ తనపై చేయి చేసుకున్నారని బాధితుడు దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ భయబ్రాంతులకు గురి చేశారని బాధితుడు సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మంగళవారం కూకట్పల్లిలో చక్కర్లు కొట్టాయి. దీనిపై కూకట్పల్లి పోలీసులకు యువకుడు ఫిర్యాదు చేయనున్నాడు.