Six people died into pond in Medchal district: ఈత సరదా ఆరుగురి ప్రాణాలు తీసింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని మాల్కారానికి చెందిన అబ్దుల్ రెహమాన్... కాచిగూడలోని అడ్జి కార్ఖానాలోని ముల్లాగా పనిచేస్తున్నాడు. అతడు ఇటీవలే మల్కారంలో ఇళ్లు నిర్మించుకున్నాడు. గృహప్రవేశానికి మదర్సాలోని పిల్లలు, తోటి ఉపాధ్యాయుల్ని ఆహ్వానించారు. విందు కోసం వస్తే.. విషాద ఘటన జరిగింది. వంటలు అవుతుండటంతో... సరదగా ఈత కొడదామని ఆరుగురు ఎర్రగుంట చెరువుకి వెళ్లారు. చెరువు లోతు ఉండటంతో అందులో పడి చనిపోయారని స్థానికులు తెలిపారు. కనీసం చెరువు చుట్టూ కంచెను కూడా ఏర్పాటు చేయకుండా వదిలేశారని పేర్కొన్నారు.
జవహర్‌నగర్ పోలీసులు... స్థానికుల సాయంతో.. చెరువుల్లోంచి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను మదర్సా ఉపాధ్యాయుడు యోహాన్, విద్యార్థులు ఇస్మాయిల్, జాఫర్, సొహైల్, అయాన్, రియాన్‌గా గుర్తించారు. మృతిచెందిన విద్యార్థుల వయస్సు 12 నుంచి 14ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. హెచ్ఎండీఏ ఇటీవలే ఎర్రగుంటను సుందరీకరించింది. తొలిసారి ఇలాంటి ఘటన జరిగిందని స్థానిక కార్పొరేటర్ రాజ్‌కుమార్ తెలిపారు. చెరువు చుట్టూ 10 అడుగుల ఫెన్సింగ్ వేస్తామన్నారు.
ఈ ఘటన గురించి సంబంధిత అధికారులు సమాచారం అందిస్తామన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. విందు కోసమని వచ్చినవారు విషాద ఘటనలో మృత్యువాత పడటంతో.. మల్కారంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారితో పాటు వచ్చిన విద్యార్థులు సైతం దుఃఖంలో మునిపోయారు. తమ తోటి స్నేహితులు లేరు అన్న బాధలో కన్నీళ్లను దిగమింగుతున్నారు.
ఇవీ చదవండి: