హైదరాబాద్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ముప్పు తప్పింది. హైదర్‌గూడలోని శ్రీ శివరామ టవర్స్‌లోని మూడో అంతస్తులో ఉన్న మాక్ యానిమేషన్, మల్టీమీడియా కార్యాలయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి. వెంటనే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఇతర భవనాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. కార్యాలయంలో ఫర్నీచర్ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసులు ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.