సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు (నల్లబండగూడెం) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ వైన్స్ వద్ద జరిగిన దాడిలో ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహమాద్పేటకు చెందిన నాగేశ్వరావు మృతిచెందాడు. మద్యం దుకాణం సిబ్బంది దాడిలోనే నాగేశ్వరరావు మరణించినట్లు బంధువులు ఆరోపించారు. దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆందోళనకారులను నచ్చజెప్పినా వారు శాంతించలేదు. మద్యం దుకాణ లైసెన్సు రద్దుచేయాలంటూ బంధువులు నినాదాలు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
'ఏపీకి చెందిన నాగేశ్వరరావు హనుమాన్ వైన్స్ షాపు వద్దకు మద్యం తాగేందుకు వచ్చాడు. ఆ సమయంలో మద్యం దుకాణ సిబ్బంది, నాగేశ్వరరావు మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన సిబ్బంది.. కర్రలతో నాగేశ్వరరావుపై దాడి చేశారు. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే వైన్స్ షాపు సిబ్బంది అక్కడ నుంచి పరారయ్యారు.'
- మృతుని బంధువులు
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ హనుమాన్ వైన్స్ ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. గతంలోనూ ఇక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగాయి. వినియోగదారులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించేవారని.. స్థానికులు చెబుతున్నారు.
ఇదీచూడండి: అఫ్గాన్ రాజధాని కాబుల్లో పేలుడు!