Father beats son to death in Neredmet: తండ్రి విచక్షణారహితంగా కొట్టడంతో కుమారుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్ నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్ వాజ్‌పేయీనగర్‌కు చెందిన కుంకుటోళ్ల సుధాకర్- వరంగల్‌కు చెందిన దివ్యకు 2019లో వివాహమైంది. కుమారుడు జీవన్(2) ఉన్నాడు.
మూడు నెలల నుంచి నేరేడ్‌మెట్ జేజేనగర్‌లోని ఎస్‌ఎస్‌బీ క్లాసిక్ అపార్టుమెంట్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. భర్త జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసై, సైకోలా వ్యవహరిస్తుండేవాడు. భార్య ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబం పోషిస్తోంది. సోమవారం రాత్రి 9.45 సమయంలో బాలుడు అల్లరి చేస్తున్నాడని, కోపంతో చెంపపై కొట్టాడు. భర్తను భార్య మందలించి పని మీద అపార్టుమెంట్‌పైకి వెళ్లింది. ఈ లోపు బాలుడు ఒక్కసారిగా అరవడంతో కిందకొచ్చి చూసింది.
శరీరం, తల, ముఖంపై గాయాలతో అపస్మారక స్థితికి చేరడంతో వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుధాకర్‌ను అరెస్టు చేశారు. తల్లి అపార్టుమెంటుపైకి వెళ్లిన సమయంలో కుమారుడిని సుధాకర్ ఇష్టమొచ్చినట్లు కొట్టడంతోనే చనిపోయినట్లుగా చెబుతున్నారు. గత కొంతకాలంగా సుధాకర్ ప్రవర్తన సరిగ్గా లేదని, ఐదు నెలల కిందట రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: