Fashion Designer Prathyusha Suicide Case : భాగ్యనగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల(36) ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై బంజారాహిల్స్ పోలీసుల దర్యాప్తులో ఆదివారం కొత్త కోణాలు వెలుగు చూశాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఆమే రాసినట్టుగా అంచనాకు వచ్చారు. మృతదేహం వద్ద లభించిన కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. కొద్దికాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న ఆమెకు బయటపడే మార్గం కనిపించలేదని భావిస్తున్నారు. తరచూ స్నేహితులు, సన్నిహితులతో జీవితంపై నిరాశను వ్యక్తం చేసేదని.. తాను మానసిక ఘర్షణకు గురువుతోందనే విషయాన్ని వారు పసిగట్టలేకపోయారని తెలుసుకున్నారు. తాను కోరిన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాననే అంతర్మథనంతో బలవన్మరణానికి సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలంలో వెతికినట్టు భావిస్తున్నారు. బొటిక్ కాపలాదారును అదుపులోకి తీసుకొని కొన్ని వివరాలు రాబట్టారు.
నొప్పి తెలియకుండా మరణించాలని.. ‘‘ఏ మాత్రం నొప్పి తెలియకుండా సునాయాసంగా మరణించాలనే’’ ఉద్దేశంతో ప్రత్యూష అంతర్జాలంలో శోధించినట్టు సమాచారం. ముందుగానే మానసికంగా సిద్ధమైన ఆమె పది రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఇంటి వద్ద అయితే కుటుంబ సభ్యులు ఉంటారనే ఉద్దేశంతో బొటిక్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. వారం క్రితం కార్పెంటర్‌ను పిలిచి స్నానాల గదిలోని కిటికీలు, ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతాన్ని మూసివేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి పాస్‌వర్డ్ ఉండడంతో సాంకేతిక నిపుణుల సాయంతో ఒకట్రెండు రోజుల్లో తెరిచి పరిశీలిస్తామని బంజారాహిల్స్ సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు.
ఎన్నిసార్లు తలుపు తట్టినా.. ప్రత్యూష బొటిక్‌కు కాపలాదారులుగా రెండు నెలల క్రితం వీరబాబు, దుర్గ దంపతులు పనిలో చేరారు. వీరికోసం బొటిక్ ఉండే భవనం కింది భాగంలో ప్రత్యూష ఒక గదిని కేటాయించారు. శుక్రవారం ఉదయం 10, 11 గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చిన ఆమె రెండుసార్లు బయటకు వెళ్లారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తిరిగివచ్చారు. తాను కిరాణ దుకాణానికి వెళ్తున్నానని ప్రత్యూషకు దుర్గ చెప్పగా.. పని ఉంటే తానే పిలుస్తానని, లోపలికి రావొద్దంటూ సూచించారు. ఉదయం తలుపు తీయకపోవడంతో రెండుసార్లు గట్టిగా తలుపు కొట్టినా తియ్యలేదని, 12 గంటల ప్రాంతంలో ప్రత్యూష తండ్రి, డ్రైవరు వచ్చారని వీరబాబు, దుర్గ ఇప్పటికే పోలీసులకు తెలిపారు.
నా బెస్టీ.. ఒత్తిడికి గురవ్వడం బాధాకరం..
ప్రత్యూష ఆత్మహత్యపై పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సినీ నటుడు కొణిదెల రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తనతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘నా బెస్టీ, నా బెస్ట్ ఫ్రెండ్ మరణంతో షాక్‌కు గురయ్యా. నాకు చాలా మంచి స్నేహితురాలు, చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి పోయింది. అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఆలోచించేదని, ఇలా అనుకోకుండా ఒత్తిడికి గురవ్వడం బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.