భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన ఎకిలం శశిధర్(28) మూడెకరాల సొంత భూమితో పాటు, 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. 12 ఎకరాల్లో సోయా, మూడెకరాల్లో పత్తి వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా పంట నీట మునగగా.. పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. బ్యాంకులో రూ.లక్ష, ప్రైవేటులో మరో రూ.4 లక్షల అప్పులున్నాయి. పంటలు నష్టపోవడంతో రుణాలు ఎలా తీర్చాలనే మనోవేదనతకు గురైయ్యాడు. ఆదివారం బజార్‌హత్నూర్ మండలం కొలారి శివారులోని తన పంటపొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శశిధర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన గౌవేని రాజయ్య(45) 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేస్తున్నాడు. కొన్నేళ్లుగా పంట దిగుబడులు సరిగా రావడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ఏడాది పంటా దెబ్బతింది. మరోవైపు రూ.10 లక్షల అప్పు ఉండటంతో మనోవేదనకు గురైయ్యాడు. ఆదివారం పత్తి చేనుకు వెళ్లిన పురుగుల మందు తాగి తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే రాజయ్య భార్య, సోదరుడు చేను వద్దకు వెళ్లి.. అపస్మారక స్థితిలో ఉన్న రాజయ్యను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Selfi Tragedy: సెల్ఫీ సరదా... తమ్ముడిని కాపాడబోయి అన్న దుర్మరణం