Hyderabad Family suicide : హైదరాబాద్ తార్నాకలో ఒకే కుటుంబంలో నలుగురి మృతి అనేక అనుమానాలను రేకేత్తిస్తోంది. చెన్నైకు చెందిన విజయ్ ప్రతాప్ హైదరాబాద్‌కు చెందిన సింధూరకు వివాహమైంది. పెళ్లికి ముందే ఇరుకుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో కలిసిమెలసి ఉండేవారు. ప్రస్తుతం ప్రతాప్ చెన్నైలోని ప్రముఖ కార్ల కంపెనీలో డిజైనర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సింధూర హైదరాబాద్‌లో ఓ ప్రముఖ బ్యాంకులో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. రెండేళ్లుగా కూతురు ఆద్యతో కలసి తార్నాకలోని రూపాలి అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్యబిడ్డలకు సహాయంగా ప్రతాప్ తల్లి జయతిని ఇక్కడే ఉంచాడు. పిల్లల భవిష్యత్ కోసం ఇద్దరూ ఉద్యోగం చేయాల్సి రావటంతో సర్దుకుపోతున్నారు. సెలవు దొరికినప్పుడల్లా ప్రతాప్
Tarnaka Family Suicide : హైదరాబాద్‌కు వచ్చి కుటుంబంతో గడిపి వెళ్తుండేవాడు. ఇటీవల ప్రతాప్ హోదా, జీతం పెరిగాయి. అప్పటి నుంచి భార్యను ఉద్యోగం వదిలేసి చెన్నై రమ్మంటూ కోరుతున్నాడు. మంచి ఉద్యోగం, తల్లిదండ్రులు ఇక్కడే ఉండటంతో కొంతకాలం నగరంలోనే ఉంటానంటూ భార్య చెబుతూ వచ్చింది. ఈ విషయమై భార్యభర్తలు తరుచూ గొడవ పడుతుండేవారు. సంక్రాంతి సెలవులు రావటంతో కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులను చెన్నై తీసుకెళ్లేందుకు ప్రతాప్ వచ్చాడు. ఈ క్రమంలోనే చెన్నై వెళ్దామంటూ మరోసారి భార్యపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి భార్యభర్తలు గొడవపడ్డారని సమాచారం.
ఏమైందో ఏమోగానీ, సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అలికిడి వినిపించలేదు. ప్రతాప్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవటంతో అతని మిత్రుడు నేరుగా ఇంటికి వెళ్లాడు. ఇరుగు పొరుగు సాయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా అందరూ విగతజీవులై కనిపించారు. అతడు వెంటనే ఓయూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. క్లూస్ టీం అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. వారు ఎలా చనిపోయారనే విషయం పోస్టుమార్టంలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఇంటికి సమీపంలోని అత్తవారింట్లో ఉన్నారు. ఆ తరువాత ప్రతాప్, సింధూర, ఆధ్య, జయతి ఇల్లు చేరారు. అర్ధరాత్రి కుటుంబం చెన్నై తరలింపు విషయంలో గొడవపడినట్టు సమాచారం. భార్య, కూతురు, తల్లిని విద్యుత్ తీగతో గొంతు బిగించి చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
ఇవీ చదవండి :