వ్యక్తి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులతో కలిసి ఎంపీపీ ఇంటి ఎదుట గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన సల్పల సమ్మయ్యను వ్యవసాయ భూమి పంచాయితీలో.. స్థానిక ఎంపీపీ భర్త రమేష్, ఆమె తండ్రి బెదిరింపులకు గురిచేశారని కుటుంబీకులు పేర్కొన్నారు. వారికి అనుకూలంగా తీర్పు రావాలంటే తమకు ఎకరం భూమి ఇవ్వాలని, లేదా రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన సమ్మయ్య రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు వెల్లడించారు. గమనించిన కుటుంబీకులు సమయ్యను ముల్కనూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతి చెందారని బాధితులు వివరించారు.
సమ్మయ్య మృతికి ఎంపీపీ భర్త, తండ్రి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనకు కారకులైన వారిని శిక్షించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు ఎంపీపీ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: Flood Effect : శంషాబాద్ వద్ద వరద ఉద్ధృతి.. జేసీబీ సాయంతో ప్రజల తరలింపు