Kovvireddy Srinivasa Rao case: నకిలీ సీబీఐ అధికారిగా చెలామణి అవుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొవ్విరెడ్డి శ్రీనివాసరావును సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈరోజు హాజరు పరిచారు. శ్రీనివాస్‌రావు.. సీబీఐ అధికారి ముసుగులో ప్రముఖులను మోసం చేస్తున్నట్లు గుర్తించిన సీబీఐ.. ఆయన్ను నవంబర్ 26న తమిళనాడు భవన్లో అరెస్టు చేశారు. నవంబర్ 27 నుంచి కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఐదు రోజులు పాటు విచారించారు. కస్టడీ సమయం ముగియడంతో ఈరోజు న్యాయస్థానంలో హాజరు పరిచారు.
సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా చలామణి: శ్రీనివాస్ నకిలీ అధికారి పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులను మోసం చేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. ఇప్పటి వరకు ఐదుగురు సాక్షులను విచారణ జరిపినట్లు కోర్టుకు తెలిపింది. శ్రీనివాసరావు మాట్లాడిన 1100 కాల్ రికార్డులు పరిశీలిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. అతను ఇలా నకిలీ అధికారిగా అవతారం ఎత్తడానికి గల కారణాలు తెలుసుకోవడానికి మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది.
విచారణకు సహకరించడం లేదు: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖులను ఎవరెవరిని ప్రలోభాలకు గురి చేశారో విచారణలో ఇంకా తేలాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. శ్రీనివాసరావుతో ఉన్న సంబంధాలపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షుల నుంచి వాగ్మూలం నమోదు చేస్తున్నట్లు తెలిపిన సీబీఐ.. ఆయన విచారణకు సహకరించడం లేదని తెలిపింది. 8 రోజుల పోలీస్ కస్టడీ తరువాత మరికొంత మంది సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈరోజుతో కస్టడీ సమయం ముగియడంతో.. ఆయన్ను విచారించేందుకు మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ.. కోర్టును కోరింది.
'విచారణ పేరుతో శ్రనివాసరావును వేదిస్తున్నారు': శ్రీనివాస్ తరపున వాదించిన న్యాయవాది.. తప్పు మోపడానికి సాక్ష్యాలు, ఆధారాల కోసం సీబీఐ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఐదు రోజులుగా కస్టడీలో ఉంచి సాధించింది ఏమీ లేదని ఆయన అన్నారు. సాక్షుల విచారణ సమయంలో శ్రీనివాస్ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్న న్యాయవాది.. పోలీసు కస్టడీలో శ్రీనివాస్‌రావును వేధిస్తున్నారని కోర్టు ముందు వివరించారు. ఇరువురి వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శ్రీనివాస్‌రావుకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం కేసు విచారణను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: