Gun Firing Incidents in Palnadu District: పోరుగడ్డ పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ మళ్లీ పడగవిప్పుతోంది. వరుస ఘటనలతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. హత్యలు, దాడులు సామాన్య ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా రొంపిచర్ల మండలం అలవాలలో తుపాకీతో కాల్పులు ఆందోళన కల్గిస్తున్నాయి. రొంపిచర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలికోటిరెడ్డిపై ప్రత్యర్థులు తుపాకీతో కాల్పులు జరిపారు.
Gun Firing Incidents in AP: ఆయన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్చగా, బాలకోటిరెడ్డి శరీరం రక్తంతో తడిసిపోయింది. పక్కా ప్లాన్‌తో ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులు పమ్మి వెంకటేశ్వరరెడ్డి, పులి అంజిరెడ్డి, వంటిపులి వెంకటేశ్వర్లు, పూజల రాముల్ని పోలీసులు పట్టుకున్నారు. రాజకీయ కోణంలో జరిగిన దాడి కాదని.. ఆధిపత్య పోరు, పాతగొడవలే కారణమని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.
కొంతకాలంగా పల్నాడులో హత్యలు, హత్యాయత్నాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రధానంగా గురజాల, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కొద్దిరోజుల క్రితమే బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగినా, పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ దాడి చేశారని వారు ఆరోపించారు.
పల్నాడులో పరిస్థితులు ఆందోళన కలిగిస్తుండటంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు చంద్రయ్యను అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ ఎంపీపీ శివరామయ్య, తనయుడు ఆదినారాయణతోపాటు మరికొందరు పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామ నడిబొడ్డున గొంతుకోసి హత్యచేశారు. ఈ కేసులో అరెస్టు అయిన వారు బెయిల్‌పై బయటకు వచ్చారు.
పల్నాడులో జరిగిన కొన్ని ఘటనలు ఇలా:
- దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో టీడీపీ నాయకుడు జల్లయ్యను వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు పట్టపగలు గ్రామం ప్రధాన రహదారిపై దాడిచేసి హత్యచేశారు. ఈ గ్రామంలో టీడీపీ సానుభూతిపరులైన 50 కుటుంబాలు ఇప్పటికీ గ్రామం విడిచిపెట్టి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నాయి. వీరి పొలాలు బీడుగా మారాయి.
- గురజాల మండలం అంబాపురంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త విక్రమ్‌ను అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు హత్యచేశారు. గురజాల పోలీసుస్టేషన్ నుంచి ఇంటికి వెళుతుండగా రాత్రి 8.30గంటల సమయంలో గ్రామంలోనే దాడిచేసి మట్టుబెట్టారు.
- దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన మాజీ సర్పంచి, టీడీపీ నేత పురంశెట్టి అంకుల్ దాచేపల్లిలో హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఒకరు హత్యలో కీలకపాత్ర పోషించారు. దాచేపల్లిలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం వద్దకు రావాలని పిలిచి గొంతుకోసి హత్యచేశారు.
- నరసరావుపేటలో ఇటీవల మసీదు స్థలం వివాదంలో టీడీపీకు చెందిన ఇబ్రహీంను జనసంచారంలోనే వైఎస్సార్సీపీ వాళ్లు కత్తులతో దాడి చేసి హతమార్చారు.
- పిడుగురాళ్ల పట్టణ శివారులో తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త షేక్ సైదాను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కర్రలతో దాడిచేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇక్కడి పరిస్థితిని అద్దంపట్టింది.
- మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ వారిపై వైఎస్సార్సీపీ వారు దాడులకు తెగబడ్డారు. అప్పట్లో గ్రామాలు వదిలివెళ్లిన 50 కుటుంబాలవారు ఇప్పటికీ బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. తురకపాలెంలో టీడీపీ కార్యకర్త ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే గ్రామంలో టీడీపీ సానుభూతిపరులకు చెందిన నలుగురి గడ్డివాములు తగలబెట్టారు. కొత్తగణేశునిపాడులో టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ వారు దాడి చేసి కొట్టారు.
ఇవీ చదవండి: