Facebook friendship: ఫేస్బుక్లో పరిచయం కాస్తా కిడ్నాప్‌గా మారింది. ఇంకేముంటుంది... డబ్బు డిమాండ్ చేశారు. ఫోన్ కాల్ ద్వారా ఒకసారి మోసపోయి రూ.50వేలు సమర్పించాడు. ఇప్పుడు ఫేస్బుక్లో పరిచయానికి మరో రూ.50వేలు ఇచ్చాడు. ఈ విషయాన్ని బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని బాధితుడు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలోని అంగలకుదురు గ్రామంలో జరిగింది.
అసలేం జరిగింది..
గుంటూరు జిల్లా తెనాలిలోని అంగలకుదురు గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి తాపీ పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అతనికి వివాహం అయిన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు చెందిన సూర్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు పాటు వాళ్లు ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారు. ఒకరోజు సూర్య తన మిత్రులతో బాపట్ల బీచ్‌కి వెళ్దామని చెప్పి కారులో అంగలకుదురు వచ్చారు. బీచ్ పేరుతో రవిని కారులో ఎక్కించుకుని, నేరుగా హైదరాబాదుకు తీసుకువెళ్లారు. తర్వాత బాధితుడిని తల్లితో మాట్లాడించి.. ఫోన్ పే ద్వారా రూ. 50 వేలు వసూలు చేసి అక్కడి నుంచి పంపేశారు. అయితే ఆ సమయంలో బాధితుడు.. పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
మళ్లీ అదే వ్యక్తి.. కానీ ఇంకోలా..
రవికి ఈ ఏడాది జనవరిలో ఫేస్బుక్ ద్వారా ఒక మహిళ ఖాతాతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు చాటింగ్ తర్వాత తాను సూర్యాపేట వస్తానని.. నువ్వూ వస్తే మాట్లాడుకుందామనుకున్నారు. ఇంకేముంది.. రవి జనవరి 16న సూర్యాపేటకు వెళ్లాడు. గతంలో తనని కిడ్నాప్ చేసిన సూర్య మళ్లీ కనిపించడం వల్ల అతడు భయాందోళనకు గురి అయ్యాడు. అయినా రవిని వదలక మళ్లీ హైదరాబాద్‌కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బాధితులు తల్లితో వీడియో కాల్ ద్వారా మాట్లాడించి రూ.55 వేలు ఫోన్‌పే ద్వారా వసూలు చేశారు. వారు కొంత ఏమరుపాటుగా ఉన్న సమయంలో రవి వారి వద్ద నుంచి తప్పించుకుని తెనాలి వచ్చాడు. గ్రామీణ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: 'పనిలేక కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారు.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాం'