ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సుధీర్‌కు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి రొస్లీ నికోలస్. లండన్ నుంచి రొస్లీ డాలర్లు పంపించారని.. అవి తనకు చేరాలంటే కొంత సొమ్ము అకౌంట్లో వేయాలని సుధీర్‌కు కస్టమ్స్ ఆఫీసర్ కవితా శర్మ పేరుతో ఫోన్ వచ్చింది. ఆమె మాటలు నమ్మిన సుధీర్ పలు దఫాలుగా రూ.10,72,500లు అకౌంట్లో జమ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కొన్ని నెలల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఓ బాధితుడు ఇదే తరహాలో రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు.
మరోవైపు ఫేస్బుక్ అకౌంట్లు హ్యాక్ చేస్తూ.. అందులో ఉన్న స్నేహితులకు డబ్బులు అవసరమని రిక్వెస్ట్ పంపుతున్నారు. టేకులపల్లి మండలంలోని ఓ పోలీసు అధికారి అకౌంట్ నుంచి.. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అకౌంట్ నుంచి ఇదే తరహాలో రిక్వెస్ట్‌లు పంపారు. తమ అకౌంట్ హ్యాక్ అయిందని సకాలంలో గుర్తించిన వారు.. వారి స్నేహితులను అప్రమత్తం చేయడం వల్ల ఎవరికీ నష్టం జరగలేదు.
ఫేస్బుక్ పరిచయాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి డబ్బు, బహుమతులు వస్తున్నాయని చెప్పగానే మోసపోవద్దని.. చెప్పారు.
- ఇదీ చదవండి : సైబర్ బూచోళ్ల నుంచి తప్పించుకోవటం ఎలా?