Extramarital affair వివాహేతర బంధానికి అడ్డొస్తుందని ఓ చిన్నారిని నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో హత్య చేసి మాక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో పారేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన గురునాథం, దుర్గాభవానీ దంపతులకు నాగలక్ష్మి(6), గీతమాధవి (14 నెలలు) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురునాథం తాపీ మేస్త్రీకాగా పని చేస్తున్నాడు, ఆర్నెల్లుగా ఆ పని వదిలేయాలని భార్య గొడవ పడింది. దీంతో ఆయన ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జులై 14న రోజు మాదిరిగానే ఉదయం ఆటో నడిపేందుకు బయటకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసేందుకు ఇంటికి వచ్చి చూసే సరికి భార్య, పిల్లలు లేకపోవడంతో కంగారుపడి, చుట్టుపక్కల వెతికి, బంధువులకు ఫోన్‌చేసి ఆరా తీశాడు. ప్రయోజనం లేకపోవడంతో భవానీపురం ఠాణాలో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు.
ఆమె తన ఇద్దరు పిల్లలతో నిజామాబాద్ నగరానికి వచ్చి కొన్ని రోజులు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండు, రైల్వేస్టేషన్ ఆవరణలో తలదాచుకుంది. అక్కడే బాన్సువాడ మండలం కొళ్లూరుకు చెందిన ద్యారంగుల శ్రీనుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి బంధానికి అడ్డొస్తుందని రైల్వేస్టేషన్‌లోనే ఈ నెల 22న నాగలక్ష్మిని గొంతునులిమి హత్య చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని మాక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ ప్రాంతంలోని కందకంలో పారేశారు. ఆ తర్వాత రోజు దుర్గాభవానీ డబ్బులు అవసరమని తన తల్లికి ఫోన్ చేసింది. విషయం భర్త గురునాథానికి తెలియడంతో పోలీసులను సంప్రదించగా ఫోన్ నంబరు ఆధారంగా నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఈ నెల 28న నిజామాబాద్‌కు చేరుకొని పిల్లలు ఎక్కడున్నారని భార్యను నిలదీశాడు.
చిన్నపాప నిద్రపోతుందని, పెద్దపాప (నాగలక్ష్మి) తన బంధువు శ్రీను వద్ద ఉందని, ఆరోగ్యం బాగోలేదని నమ్మబలికింది. అనుమానం వచ్చిన భర్త శ్రీను ఎవరు నాకు తెలియని చుట్టాలు ఇక్కడెవరు ఉన్నారు. నన్ను ఆయన వద్దకు తీసుకెళ్లు అని గట్టిగా నిలదీయడంతో చంపేసినట్లు సమాధానం ఇచ్చింది. చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో పారేశామని చెప్పి భర్తను తోసేసి అక్కడి నుంచి పారిపోయింది. గురునాథం మాక్లూర్ ఠాణాలో ఫిర్యాదు చేయగా నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. సీఐ నరహరి, ఎస్సై యాదగిరిగౌడ్, తహసీల్దారు శంకర్ వారిని తీసుకొని ఘటనా స్థలికి వెళ్లి పోస్టుమార్టం అనంతరం అక్కడే బాలిక అంత్యక్రియలు చేయించారు. గురునాథం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.