Exploding bomb at bayyaram cheruvu: బయ్యారం పెద్ద చెరువు సమీపంలో నాటుబాంబు పేలుడు కలకలం సృష్టించింది. కురవి మండలం గుండ్రాతిమడుగు సమీపంలోని రైల్వే గేట్ వద్ద గేట్మెన్గా పనిచేస్తున్న రవి, తన మిత్రులు రైల్వే ఉద్యోగులైన రాజు, ఉమేష్, కొమిరెల్లిలతో కలిసి బయ్యారం పెద్ద చెరువు సమీపంలో విందు చేసుకున్నారు. చీకటి పడే సమయంలో రవి బహిర్భూమి కోసం చెరువు సమీపంలోకి వెళ్లాడు.
ఈ సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించి రవి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు చేతులు పూర్తిగా నుజ్జు నుజ్జయ్యాయి. కళ్లు దెబ్బతిన్నాయి. దీంతో మిగతా ముగ్గురు మిత్రులు కారులో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు.
సోమవారం ఉదయం బయ్యారం సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవి ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. పేలుడు పదార్థాలతో చేపలు పట్టేందుకు ప్రయత్నించే సమయంలో పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. విచారణ చేస్తున్నామని, దర్యాప్తులో పూర్తి విషయాలు వెల్లడవుతాయని తెలిపారు.
"నిన్న బయ్యారం పెద్ద చెరువు మత్తడి దగ్గర బాంబు పేలుడు జరిగినట్లు సమాచారం అందింది. ఈ దుర్ఘటనలో రైల్వే ఉద్యోగి రవి కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మిత్రులు ఆసుపత్రికి తరలించారు. మేం అక్కడికి వెళ్లి విచారించగా చేపలు పట్టడానికి బాంబు ఉపయోగించే సమయంలో పేలుడు సంభవించినట్లు భావిస్తున్నాం. పూర్తి విచారణ చేసి నిందితులను పట్టుకుట్టాం."-బాలాజీ, బయ్యారం సీఐ
ఇవీ చదవండి: