మున్నా గ్యాంగుపై ఏపీలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న పోలీసు స్టేషన్లలో 7 కేసులు నమోదుకాగా, 4 కేసుల్లోనే విచారణ పూర్తయి తాజాగా శిక్షలు పడ్డాయి. నేరాలు జరిగిన కాలంలో ఎస్పీగా ఉన్న నవీన్‌చంద్ నుంచి ప్రస్తుత ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వరకు ప్రతి ఉన్నతాధికారి దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. విచారణ కాలంలో నలుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మారినా పట్టు సడలనివ్వలేదు. 4 కేసుల్లో 169 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుల్లో న్యాయమూర్తి 300 పేజీల తీర్పును వెలువరించారు.
బయటకొస్తే అఘాయిత్యాలే
నిందితుల్లో 13 మంది 13 హత్య కేసుల్లో ఉన్నప్పటికీ చట్టప్రకారం వీరందరికీ ఆయా కేసుల్లో బెయిల్ లభించింది. తొలిరోజుల్లో నాలుగు కేసుల్లో అరెస్టయిన 18 మందికీ అనతి కాలంలోనే బెయిల్ వచ్చింది. కొందరు బయటకు వచ్చాక మళ్లీమళ్లీ నేరాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
* రెండుసార్లు బెయిల్ పొందిన మున్నా అజ్ఞాతంలోకి వెళ్లి నేరాల దందా కొనసాగించాడు. గుప్తనిధుల పేరిట పలువురిని ఉచ్చులోకి లాగాడు. 2014లో కర్నూలు జిల్లా నంద్యాలలో చిక్కినప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు.
* బత్తుల సాల్మన్ బెయిల్‌పై బయట వచ్చాక ఒంగోలులో ఓ మహిళను హత్య చేసి 2014లో మళ్లీ జైలుకెళ్లాడు.
* ఏపూరి చిన్నవీరాస్వామి 2014లో మార్కాపురంలో ఒక దోపిడీ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లాడు.
* దాదాపీర్ అలియాస్ ఘనీకి నల్గొండ జిల్లాలోని ఓ కేసులో మూడేళ్ల జైలుశిక్ష పడటంతో జైల్లోనే ఉన్నాడు.
* జమాలుద్దీన్ ఆరేళ్లపాటు పోలీసులకు దొరకకుండా తిరిగి, ఇటీవలే పట్టుబడ్డాడు.
* ఈ కేసుల్లో మిగిలిన ముగ్గురు బెయిల్‌పై బయటే ఉన్నారు. అయినా జైలులో ఉన్న మున్నాకు బయటి నుంచి సహకారం అందించారనే ఆరోపణలు ఉన్నాయి.
రాజమహేంద్రవరం జైలుకు మున్నా ముఠా
శిక్ష పడిన మున్నా ముఠాలోని 12 మందిని పోలీసులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు వారిని తీసుకొచ్చి తమ అధికారులకు అప్పగించారని జైలు సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు. కరోనా నేపథ్యంలో వారిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచామన్నారు. జీవితఖైదు, జైలుశిక్ష పడిన వారిని నెల్లూరు జైలుకు తరలించారు.
మిగిలిన కేసుల్లో ఏ తీర్పు వస్తుందో?
మున్నా గ్యాంగుపై ప్రకాశం జిల్ల్లాలో 7 కేసులు నమోదుకాగా, వాటిలో నాలుగు కేసుల్లోనే ప్రస్తుత శిక్షలు పడ్డాయి. మరో మూడు కేసులకు సంబంధించి (నాగాలాండ్ లారీ ఢ్రైవర్ హత్య, బెంగళూరులో 3 పిస్టోళ్ల స్వాధీనం, మద్దిపాడులో ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం) న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. వీటిలోనూ ప్రధాన నిందితుడు మున్నానే. అతని పాత సహచరులతో పాటు కర్నూలు, నంద్యాల, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఈ 3 కేసుల్లో ఎలాంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. మరోపక్క, మున్నా ముఠా అకృత్యాలను కోర్టులో నిరూపించేందుకు తమ సిబ్బంది 11 ఏళ్ల పాటు శ్రమించారని, ఎన్నో రాష్ట్రాలు తిరిగి సాక్ష్యాధారాలు సేకరించారని నెల్లూరు సీఐడీ అదనపు ఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్ పేర్కొన్నారు. తాజా తీర్పులో ఆ ఫలితం కన్పించిందని చెప్పారు. మంగళవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ ఈ కేసు విచారణ చేపట్టిన అధికారులకు అవార్డులు సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు.