విడాకులు అయిన యువతులే అతడి లక్ష్యం.. వివాహ పరిచయ వేదికే అతడి మార్గం.. వెనుక మంత్రి ఉన్నాడన్న ధైర్యం.. ఇంకేముంది.. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కంపెనీలో పనిచేస్తానని డే అండ్ నైట్ డ్యూటీలు ఉంటాయని.. ఒకరి కళ్లుగప్పి ఇంకొకరి దగ్గరి వెళ్తూ కాలం వెళ్లదీశాడు. అందులోనూ వాళ్లందరిని ఎక్కడెక్కడో ఉంచటం కాదు.. పక్కపక్క వీధుల్లోనే ఉంచి ఎవరికీ దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంత అతితెలివి ఉన్న ఘనుడు ఎవరో కాదు.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు సమీప బంధువు అడపా శివశంకర్‌బాబు.
ఏపీలోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివ శంకర్.. వివాహ పరిచయ వేదిక ద్వారా పెళ్లి జరిగి విడాకులైన యువతులను ఎంచుకుంటాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు వారితో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. పెద్ద ఉద్యోగం కాబట్టి ఎప్పుడుపడితే అప్పుడు వెళ్లాల్సివస్తుందని నమ్మించేవాడు. క్లయింట్ దగ్గరకు వెళ్తున్నాని చెప్పి.. ఒకరి దగ్గరి నుంచి మరొకరి దగ్గరికి వెళ్తూ తన విషయం బయటపడకుండా జాగ్రత్తపడేవాడు. అయితే.. క్లయింట్ దగ్గరికి వెళేందుకు.. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఇలా రకరకాల కారణాలతో డబ్బులు లాగేవాడు. ఈ నిత్యపెళ్లికొడుకు మోసానికి దగాపడ్డ బాధితులంతా ఉన్నత విద్యావంతులే కావటం గమనార్హం.
అయితే.. శివశంకర్ మోసానికి బలైన ఇద్దరు యువతులు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతాన్ని బయటపెట్టారు. శివశంకర్ ఇప్పటికే చాలా మందిని మోసం చేసినట్టు తమకు సమాచారం ఉందని బాధితులు తెలిపారు. పెళ్లి పేరుతో తమను మోసం చేశాడని.. సుమారు 60 లక్షల వరకు నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధితులు కన్నీళ్ల పర్వంతమయ్యారు. ఏ ఉద్యోగం లేని శివశంకర్.. క్లయింట్ వద్దకు వెళ్తున్నానని చెప్పి వేరే భార్యల దగ్గరికి వెళ్లేవాడని వాపోయారు. మోసపోయిన 11 మందిలో ఏడుగురు కొండాపూర్ ప్రాంతంలోనే ఉన్నారని.. వారందరిని పక్కపక్క వీధుల్లోనే ఉంచుతూ ఈ మోసానికి పాల్పడ్డాడరని బాధితులు చెబుతున్నారు. తమలా మరికొంత మంది మోసపోకూడదన్న ఉద్దేశంతోనే.. తాము మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శివశంకర్‌పై పలు పోలీసుస్టేషన్‌లలో కేసులు ఉన్నా.. పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా.. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: తెలంగాణలో మరో 3 రోజులు విద్యాసంస్థలు బంద్