Unemployment Suicide at Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో విషాదం చోటు చేసుకుంది. నిరుద్యోగంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుల్కచర్లకు చెందిన శివుని శ్రీనివాస్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మధ్యలో లాక్డౌన్ రావడంతో అవకాశాలు తగ్గడం వల్ల మరింత కుంగిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగం రాకపోవడంతో.. మానసికంగా చాలా మదనపడ్డాడు. ఉద్యోగం చేసి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకున్నాడు కానీ.. విధి అతనికి సహకరించలేదు. పైగా తానే ఇంట్లో వారికి భారమవుతున్నాననే అభిప్రాయానికి వచ్చేశాడు.
ఎలా అయినా చనిపోవాలి.. ఎవరికి భారం కాకూడదని అనుకున్నాడు. తన చావుకి ఎవరూ కారణం కాదని.. ఉద్యోగం రాకపోవడం వల్ల సమాజంలో చులకనగా చూస్తున్నారనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఇంటికి వచ్చిన తల్లి కుమారుడి మృతదేహాన్ని చూసిన కన్నీరు మున్నీరయ్యారు. ఉద్యోగం రాకపోయినా బిడ్డ కళ్లముందు ఉంటే చాలు అనుకున్నామని.. ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కుల్కచర్లకు చెందిన సత్తెమ్మ, రామయ్యలకు ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. గత 15 సంవత్సరాల క్రితం సత్తెమ్మ భర్త రామయ్య చనిపోయాడు. సత్తెమ్మ కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేసింది. కష్టం చేసి కొడుకు శ్రీనివాస్‌ను బీటెక్ చదివించింది. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తాడనుకోలేదని తల్లి సత్తెమ్మ వాపోయింది. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: Actress hits bike : వేగంగా కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన నటి.. విషమం