Student Suicide: నగరంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మూడంతస్తుల భవనం పైనుంచి దూకి విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధి చంద్రపురికాలనీలో జరిగింది. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు దర్యాప్తులో ఆత్మహత్యగా తేల్చారు. విద్యార్థినికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి.
వర్షిత అనే పాప మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు చిప్స్ కొనుక్కునేందుకు బయటికి వెళ్లింది. మన్సూరాబాద్‌లోని మధురానగర్ రోడ్ నెం.5 నుంచి వెళ్లింది. పాప మిస్సయిందని డయల్ 100 కు కాల్ రావడంతో మేం దర్యాప్తు ప్రారంభించాం. వెంటనే అక్కడికి వెళ్లి పాప తల్లిదండ్రులతో మాట్లాడాం. సత్యనారాయణరెడ్డికి ముగ్గురు కూతుర్లు. పాపా ఆరో తరగతి చదువుతోంది. విచారిస్తుండగానే పాప భవనంపై నుంచి దూకిందని తెలిసింది. అసలేం జరిగిందని దర్యాప్తు చేస్తున్నాం. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా పాప దక్కలేదు. పై నుంచి కిందపడడం వల్లే మృతి చెందింది. - శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ
చంద్రపురికాలనీకి చెందిన వర్షిత(11) మంగళవారం సాయంత్రం భవనంపై నుంచి దూకగా మొదటగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో స్థానికులను, కుటుంబ సభ్యులను పోలీసులు విచారించడంతోపాటు.. సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించారు. వర్షితతోపాటు మరో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలే కావడంతో ఇంట్లో చిన్న చిన్న కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిన వర్షిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇవీ చదవండి: రామయ్య సన్నిధిలో పాడైపోయిన సుమారు 5వేల లడ్డూలు
జుబైర్‌కు సుప్రీంలో ఊరట.. అన్ని కేసుల్లో బెయిల్.. జైలు నుంచి విడుదల!