- ఆర్డరిచ్చిన బోటి కూర వేడి చేసుకు తేవాలంటూ నిర్వాహకుల్ని సతాయించాడో మందుబాబు. చిరాకొచ్చి పక్కనే ఉన్న ఓ యువకుడు ఎందుకు గొడవంటూ మందలించాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మందుబాబు పక్కనే బజ్జీలు కాల్చుతున్న వేడివేడి నూనెను ప్రశ్నించిన వ్యక్తిపై పోసేశాడు. ఒళ్లంతా కాలిన దశలో ఆసుపత్రిలో చేరాడు యువకుడు. సోమవారం మల్లాపూర్‌లోని ఓ వైన్స్ పర్మిట్ రూమ్‌లో జరిగిందీ ఘటన.
- లంగర్‌హౌజ్‌కు చెందిన వికాస్(35) ప్రైవేటు ఉద్యోగి. పీర్జాదిగూడలో ఉండే స్నేహితుడితో కలిసి ఉప్పల్‌లోని ఓ వైన్స్‌కి వెళ్లాడు. అక్కడ తాగుతూ ఆమ్లెట్ ఆర్డర్ చేశాడు. రూ.60 చెల్లించాలని నిర్వాహకులు కోరగా వారితో వాగ్వాదానికి దిగాడు. ఇరువర్గాల ఘర్షణలో తీవ్ర గాయాలైన వికాస్ అక్కడికక్కడే మరణించాడు.
ఈ రెండే కాదు.. నగరంలో ఉన్న 250కి పైగా అనుమతి పొందిన.. మరో 200 అనధికారిక మద్యం దుకాణాల పర్మిట్ రూముల్లో తరచూ ఇవే వివాదాలు. రోడ్లమీదే తాగడం.. వాగడం.. వచ్చిపోయే వారితో గొడవలకు దిగడం ఇప్పుడు షరామామూలే. నగరంలోని కొన్ని మద్యం దుకాణాల ముందు నుంచి కొంచెం చీకటి పడితే ఆవైపుగా మహిళలు వెళ్లాలంటే వణకాల్సిన దుస్థితి. ఫిర్యాదులిస్తున్నా ఆబ్కారీ, పోలీస్ శాఖలూ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండంతో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని మండిపడుతున్నారు నగరవాసులు.
రోడ్లే అడ్డాలు.. స్థానికులకు అవస్థలు
2016లో పర్మిట్ రూమ్‌ల విధానానికి ప్రభుత్వం అనుమతించింది. గ్రేటర్ పరిధిలో దాదాపు 600 దాకా మద్యం ఔట్‌లెట్లు ఉండగా.. 250 దాకా పర్మిట్ రూములకు అనుమతులున్నట్లు అంచనా. వీటికి కనీసం 100 చదరపు మీటర్ల ప్రాంగణం ఉండాలి. కానీ, దాదాపు 80 శాతం పర్మిట్ రూమ్‌ల వద్ద ఆ పరిస్థితి లేదు. దీంతో వైన్స్ ముందున్న రోడ్లపైనే బహిరంగంగా తాగేస్తున్నారు మందుబాబులు.
చీకటి పడితే.. అమ్మో!
- ఎర్రగడ్డ డివిజన్‌లో ఓ వైన్స్ ముందు నుంచి సాయంత్రం 5 గంటలు దాటాక వెళ్లాలంటే భయం. కళ్యాణ్‌నగర్, ప్రభాత్‌నగర్, సారథినగర్ వెళ్లే జనానికి ఇక్కడ రోడ్లమీద తాగే మందుబాబులతో రోజూ తంటాలే. మహిళలకైతే వచ్చేందుకు వణుకే.
- నాచారంలో అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న వైన్స్, చక్రిపురం నుంచి చర్లపల్లి వెళ్లే మార్గంలో మందుబాబులు రోడ్లపైనే తిష్ఠ వేస్తుంటారు. ఇక్కడి పరిశ్రమల్లో విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే మహిళలు రోజూ చీకటి పడిందంటే భయపడుతూ వెళ్లడం పరిపాటిగా మారింది.
- గుర్రంగూడ, కర్మన్‌ఘాట్, కూకట్‌పల్లి, మాదాపూర్, రామంతాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్, బాలాపూర్, టోలిచౌకి, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మల్కాజిగిరి, సీతాఫల్‌మండి,బోయిన్‌పల్లి, కొంపల్లి, నాచారంలోనూ అనధికారిక పర్మిట్ రూమ్‌లతో స్థానికులకు తలనొప్పులు తప్పట్లేదు.
నిబంధనలకు తూట్లు
ఆబ్కారీ శాఖ నిబంధనల మేరకు పర్మిట్ రూమ్‌లో మద్యం తాగేందుకు మాత్రమే ఏర్పాట్లు ఉండాలి. కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు, శౌచాలయం లాంటివాటికే పరిమితం. కానీ అన్ని గదుల్లో వెజ్, నాన్‌వెజ్ చిరుతిళ్లు, ఇతర అమ్మకాలతో ఒక్కో పర్మిట్ రూమ్‌లో కనీసం 15 రకాల వ్యాపారాలు సాగుతున్నాయి. మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుండగా.. వీటి ద్వారా రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఈ గదులకు అడ్డుగా తెరలుండటంతో పాటు సీసీ కెమెరాలతో ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా రోడ్లనే తాగేందుకు వాడేస్తున్నారు మందుబాబులు. అక్కడే గొడవలకు దిగి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
ఇదీ చూడండి: LIQUOR MALLS: ఆ రాష్ట్రంలో మద్యం నిషేధం హామీ గాలికి