Road accidents in Hyderabad: హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అమాయకులు నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ కొందరు రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. గతేడాది డిసెంబరు నుంచి జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే.. వేగంగా వెళ్తూ.. ప్రమాదానికి కారణమవుతున్న వాహనదారులు కొందరు.. వారి నిర్లక్ష్యం వల్ల అమాయకులు మరికొందరు మృత్యు ఒడికి చేరుతున్నారు. ప్రమాదాలు అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. మద్యం సేవించిన వాహనదారులు ఘోర ప్రమాదాలకు కారకులవుతునే ఉన్నారు.
నిర్లక్ష్య డ్రైవింగ్.. పసికందు మృతి
రెండు రోజులుగా జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా.. వీరిలో ఓ చిన్నారి కూడా కంటతడి పెట్టిస్తోంది. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘటనలో ఎమ్మెల్యే సమీప బంధువు.. రోడ్డు పక్కన బెలూన్లు విక్రయిస్తున్న ముగ్గురు మహిళలను ఢీ కొట్టగా.. తల్లి కళ్ల ముందే రెండునెలల చిన్నారి మృతి చెందింది. ముగ్గురు మహిళలు సహా మరో చిన్నారి గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు.
మద్యం మత్తు.. అతి వేగం.. యూట్యూబర్ బలి
Youtuber Gayatri Died: శుక్రవారం సాయంత్రం సైబరాబాద్‌లోని విప్రో చౌరస్తా నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు.. అతివేగంగా వస్తూ అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన రోహిత్ కారు నడిపినట్లు భావిస్తున్నారు. వాహనంలో ప్రముఖ యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి కూడా ఉంది. శుక్రవారం ఉదయం నుంచి స్నేహితులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొని పబ్‌కు వెళ్లారు. అనంతరం బయటకు వచ్చి కొబ్బరిబోండాల్లో దాచి ఉంచిన మద్యాన్ని సేవించారు. రోహిత్, గాయత్రి కలిసి కారులో సాయంత్రం ఇంటికెళ్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి వేగంగా ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అక్కడే చెట్లకు నీళ్లు పోస్తున్న మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఎగిరి పడ్డారు
ప్రమాదం జరిగిన సమయంలో కారు 120 కిలోమీటర్లు పైగా వేగంతో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఫుట్‌పాత్‌ను ఢీ కొన్న వెంటనే కారు బోల్తా పడటంతో... లోపల ఉన్న రోహిత్, గాయత్రి ఎగిరిపడిపోయారు. ప్రమాదంధాటికి కారు రూపురేఖలే మారిపోయాయి. తీవ్రంగా గాయపడిన గాయత్రి ప్రాణాలొదిలింది. రోహిత్ చికిత్స పొందుతున్నాడు. మితిమీరిన వేగమే కారణంగా పోలీసులు చెబుతున్నా... రోహిత్ మద్యం సేవించి వాహనం నడిపాడా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
టీ తాగేందుకు వెళ్తుండగా
గతేడాది డిసెంబర్ 6 న బంజారాహిల్స్ రోడ్డు నం 2లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు అర్ధరాత్రి టీ తాగేందుకు బయటికి వెళ్లారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొని ఘటనా స్థలంలోనే ఇద్దరూ చనిపోయారు. ప్రమాదానికి కారణమైనవారు పబ్బులో మద్యం సేవించారు. ఖరీదైన సిగరెట్ల కోసం కారులో వేగంగా వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అదే రోజు నార్సింగి పీఎస్ పరిధిలో జరిగిన ప్రమాదంలోనూ దంపతులు మృతి చెందారు. దుర్గరాజు, మౌనిక దంపతులు పాలు విక్రయించి కుటుంబాన్ని పోషించేవాళ్లు. వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది.
మద్యం మత్తులో
డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారిపై నడుచూకుంటూ వెళ్తున్న నలుగురిని కారు ఢీకొట్టింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న ముగ్గురు వైద్యులు.. మద్యం మత్తులో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. డిసెంబర్ 18వ తేదీన హెచ్‌సీయూ ఆర్టీసీ డిపో సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ రజాక్, ఎమ్.మానస, ఎన్.మానస మృతి చెందారు. జేవీ కాలనీలోని ఇంట్లో మద్యం సేవించి, అర్ధరాత్రి టీ తాగేందుకు లింగంపల్లి వైపు వెళ్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఘటనలో కారు రెండుముక్కలైంది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన మెయినాబాద్ పీఎస్ పరిధిలో జరిగిన ప్రమాదంలో మద్యం సేవించి కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదంలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రస్తుతం రాత్రి సమయాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఉదయం వేళ కూడా చేపడితే ప్రమాదాలు కొంతవరకు నియంత్రించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: Hyderabad Road Accidents: కలకలంరేపుతోన్న వరుస రోడ్డు ప్రమాదాలు... మితిమీరిన వేగమే కారణం?