పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కావడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ శివారులోని స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ప్రశ్నాపత్రాలు సామాజిక మాధ్యమాల ద్వారా లీక్ అయినట్టు బయటపడింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య మండలి అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల చీఫ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేషన్ అధికారి, ఆచార్యుడి ద్వారానే ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్టు బయటపడింది. వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అసలేం జరిగిందంటే...
హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ద్వారా ప్రశ్నాపత్రాలు లీకేజీ అయినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి అధికారులు గుర్తించారు. ఈ నెల 8 నుంచి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే వాట్సాప్ ద్వారా ప్రశ్నా పత్రాలు స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్ధులకు పరీక్ష ప్రారంభం కంటే ముందుగా లీక్ అయినట్టు బయటపడింది. కళాశాల విద్యార్ధుల ద్వారా ఇతర కళాశాలల విద్యార్ధులకు ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారి కృష్ణ మూర్తి, ఆచార్యుడు కృష్ణ మోహన్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు తేలింది.
ఆ ముగ్గురు కలిసే.. ఈ తతంగం
పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచే కళాశాలలో పనిచేసే చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారి కృష్ణమూర్తి, ఆచార్యుడు కృష్ణ మోహన్ కలిసి లీకేజీ తతంగం కొనసాగిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే కళాశాల విద్యార్థులకే కాకండా ఇంకా ఎవరెవరికి ప్రశ్నాపత్రాలు చేరాయి అనే విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, పరీక్ష కేంద్రాన్ని మూసివేశారు. అయితే ఈ వ్యవహారంతో మొత్తం పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లీకేజీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందుకు కారకులైన వారిని ప్రశ్నిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి : Tollywood drugs case Update : మరోసారి తెరపైకి టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు