రాష్ట్రంలో గత ఏడాది అత్యధిక రోడ్డు ప్రమాదాలు డిసెంబరు నెలలో జరిగాయి. మొత్తంగా జనవరి, ఫిబ్రవరి, నవంబరు, డిసెంబరు నెలల్లో.. ప్రతి మాసంలో నెలకు 2 వేలకు పైగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మిగతా నెలల్లో ఈ స్థాయిలో జరగలేదు. దీనినిబట్టి శీతాకాలం ప్రమాదాలకు నెలవుగా మారుతోందని నివేదికలు చెబుతున్నాయి. పొగ మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడని పరిస్థితే ఇందుకు ప్రధాన కారణం కావచ్చని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2020లో 19,172 ప్రమాదాలు జరగగా.. 18,661 మంది గాయపడ్డారు. 6,882 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదాలకు కారణాలు? ఏ సమయంలో? ఏ వాహనాలు ఎక్కువగా ప్రమాదాల బారినపడ్డాయి? తదితర అంశాలపై తెలంగాణ రోడ్డు భద్రత విభాగం పరిశీలనలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. అధిక దుర్ఘటనలకు ద్విచక్ర వాహనదారులే కారణమని, అధిక వేగం కారణంగానే 78.12 శాతం ప్రమాదాలు జరిగాయని గుర్తించారు. అలానే రాత్రి 6 నుంచి 9 గంటల మధ్య ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జాతీయ రహదారుల కంటే అంతర్గత మార్గాల్లోనే ఎక్కువ మంది మృత్యువాత పడగా.. పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాలే ఎక్కువగా ప్రమాదాలకు నెలవుగా మారాయి.