కేవైసీ (నో యువర్ కస్టమర్) అప్‌డేట్ కాలేదనో.. యోనో మొబైల్ యాప్ బ్లాక్ అవుతుందంటూ ఎస్‌బీఐ పేరిట వచ్చే ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక్క సైబరాబాద్‌లోనే 140 కేసులు నమోదు కాగా రూ.67.1 లక్షలు మోసపోయినట్లుగా వివరిస్తున్నారు.
మీకు మేం సాయం చేస్తామంటూ.. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదని కింద ఇచ్చిన లింక్‌లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయకపోతే మీ ఖాతాను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తుంటారు. మరికొన్నేమో ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘యోనో’కు సంబంధించినవి ఉంటాయి. కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి పాన్ కార్డు నంబర్ నమోదు చేసుకోకపోతే ఈరోజు రాత్రి నుంచి మీ యాప్ బ్లాక్ అవుతుందంటూ పేర్కొంటున్నారు. ఎస్‌ఎంఎస్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేయగానే అవతలివైపు వ్యక్తులు మీకు సాయం చేస్తామంటూ నమ్మబలుకుతారు. ఎనీ డెస్క్ యాప్, క్విక్ సపోర్ట్ యాప్, టీం వ్యూయర్ యాప్ తదితర రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోమని చెబుతారు. వాటి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తీసుకుంటారు. ఆ క్రమంలో మనం నమోదు చేసే బ్యాంక్ ఖాతా, ఓటీపీ, ఇతరత్రా వివరాలు వాళ్లకు తెలిసి మన ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
నకిలీ వెబ్‌సైట్... లాగిన్ ఎర్రర్.. ఎస్‌ఎంఎస్‌లో ఉన్న లింక్‌పై క్లిక్ చేయగానే ఎస్‌బీఐ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుండటంతో మనకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. నిజానికి అది నకిలీది. ఇక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ తదితర వివరాలను నమోదు చేయమని అడుగుతున్నారు. అలా చేయగానే ‘లాగిన్ ఎర్రర్’ అని వస్తుంది. ఎక్కడో సాంకేతిక సమస్యల తలెత్తి ఉంటుందని మనం భావిస్తుంటాం. ఆ క్రమంలోనే సైబర్ కేటుగాళ్లు మనం అక్కడ నమోదు చేసిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ సాయంతో మన బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తున్నారు.
ఆ ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దు
'ఎస్‌బీఐ బ్యాంక్ పేరిట వచ్చే బల్క్ ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్ధు లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్ధు ఖాతా, ఓటీపీ, పిన్, ఇతరత్రా ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్ధు అనుమానం వస్తే వెంటనే బ్యాంక్‌ను సంప్రందించాలి. '
- సామల వెంకట్‌రెడ్డి, సైబరాబాద్ సైబర్‌క్రైమ్స్ ఏసీపీ
ఇదీచూడండి: Honey Trap: బావ.. మరదలు.. ప్రియుడు.. మధ్యలో ఓ సుబ్బు.. వలపు వలతో కోటి కాజేశారు!