విమాన పైలెట్‌కే సైబర్ దొంగలు(Cyber Crime in Hyderabad) టోకరా వేశారు. ఏకంగా రూ.10 లక్షలు కొట్టేశారు. బేగంపేట్‌కు చెందిన ప్రభాకర్ ఓ విమానయాన సంస్థలో పైలెట్. ఎస్‌బీఐలో ఆయనకు ఖాతా ఉంది. ఇటీవల ఆయన ఫోన్‌కు ‘వెంటనే మీ ఖాతా కేవైసీ అప్‌డేట్(SBI KYC UPDATION) చేసుకోవాలని, లేనిపక్షంలో సేవలు నిలిచిపోతాయని హెచ్చరిస్తూ..’ లింక్‌తో కూడిన సందేశం వచ్చింది. అది నిజమే అనుకున్న బాధితుడు ఆ లింక్ తెరిచారు. ఓ దరఖాస్తు ఫారం ప్రత్యక్షం కాగా.. అందులో వివరాలన్నీ పొందుపరిచారు. కొద్దిక్షణాల్లోనే ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీకో ఓటీపీ వచ్చింది చెప్పమన్నాడు. ఆ నంబరు చెప్పిన వెంటనే బాధితుడి ఖాతాలోంచి రూ.2.50 లక్షలు పోయాయి. ఇలా జరిగిందని అడిగితే.. ఆ మొత్తం వెనక్కి వస్తాయని చెబుతూనే.. మరో ఓటీపీ పంపించారు. ఆ నంబరు చెప్పగానే మరికొంత డబ్బు పోయింది. ఇలా నాలుగు విడతల్లో రూ.10 లక్షలు దోచేశాడా సైబర్ మోసగాడు(Cyber Crime in Hyderabad). అనంతరం బాధితుడు హైదరాబాద్ సైబర్ పోలీసుల(HYDERABAD CYBER CRIME POLICE)కు ఫిర్యాదు చేశారు.
ఆర్మీ అధికారినంటూ...
మారేడ్‌పల్లిలో ఉండే కిషోర్ ఓఎల్‌ఎక్స్‌లో పరిశీలిస్తుండగా.. ఒక కొత్త ద్విచక్రవాహనం తక్కువ ధరకే విక్రయిస్తున్నామంటూ ఓ ఆర్మీ అధికారి ఇచ్చిన ప్రకటన కనిపించింది. అందులోని నంబరులో సంప్రదించగా.. అవతలి వ్యక్తి తాను బదిలీపై వెళుతున్నానని చెప్ఫి. రూ.30 వేలకు బేరమాడుకున్నాడు. ఆతర్వాతే నేరుగా మీరు మా ఖాతాలో డబ్బులు వేస్తే ఆర్మీ నిబంధనల ప్రకారం నేరమవుతుంది. కాబట్టి మీకో క్యూఆర్ కోడ్ పంపిస్తాను. దానిని స్కాన్ చేయాలని సూచించాడు. బాధితుడు ఆ కోడ్ స్కాన్ చేయగా ఖాతాలోంచి రూ.1.42 లక్షలు ఖాళీ అయ్యాయి. ఆ వెంటనే ఆ మోసగాడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది.