CYBER FRAUD: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆఫర్ల పేరుతో లింక్‌లు పంపడం, బహుమతి గెలిచారని మాయమాటలు చెప్పడం లాంటివి ఇప్పుడు పాతవైపోయాయి. ఇప్పుడు ఏకంగా బ్యాంకుల నకిలీ వెబ్సైట్లనే తయారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఆన్‌లైన్ బ్యాంక్ ఖాతా అప్‌డేట్ చేసుకోండి అని, లేదా కేవైసీ అప్‌డేట్ చేసుకోండి అని ఆర్బీఐ ఆదేశాల మేరకు మెసేజ్ చేస్తున్నట్లు లింకులు పంపుతారు. ఈ లింకులను ఓపెన్ చేయగానే నకిలీ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్తుంది. పేరు లేదా యూజర్ ఐడీ అడుగుతుంది. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలంటుంది. అది ఇవ్వగానే మరో ఓటీపీ వస్తుంది. అది చెప్పగానే... మన ఖాతాలోని డబ్బును వేరే ఖాతాలోకి పంపినట్లు మెసేజ్ వస్తుంది. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు పోయాయని గుర్తించే లోపే సైబర్ నేరగాడు తన పని తను ముగించేస్తాడు.
15 రోజుల్లోనే రూ.75 లక్షలు..
ఇటీవల సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ గృహిణి, బంజారాహిల్స్‌లో ఉండే ఓ యువకుడి నుంచి ఇలాగే సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షల చొప్పున కాజేశారు. బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంటున్న ఈ కేటుగాళ్లు 15 రోజుల్లోనే హైదరాబాదీయుల నుంచి సుమారు రూ.75 లక్షలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు.
వ్యాలెట్ యాప్స్‌లోకి బదిలీ..
మోసాలు జరగకుండా ఆపేందుకు గేట్ వేలు ఉంటాయి. కానీ వీటిని కూడా బోల్తా కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. డెబిట్, క్రెడిట్ కార్డుదారుల ఆన్‌లైన్ ఖాతాల నుంచి నగదు కాజేస్తున్న సైబర్ నేరస్థులు.. వీటిని నేరుగా తమ ఖాతాల్లోకి వెంటనే జమ చేసుకోవడం లేదు. ఎందుకంటే.. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు బదిలీ చేసేటప్పుడు బ్యాంకు నుంచి నగదు వెళ్లకుండా 24 గంటల పాటు గేట్‌వే ద్వారా ఆపుతుంది. మోసపోయామని గుర్తించి వెంటనే పోలీసులను, బ్యాంకు అధికారులను సంప్రదిస్తే ఆ మొత్తం దొంగలకు వెళ్లకుండా ఆపేస్తారు. అందుకే సైబర్ నేరగాళ్లు పదుల సంఖ్యలో వ్యాలెట్ యాప్‌లను ఉపయోగించి.. 5 వేలు, 6 వేలు, 10 వేల చొప్పున వ్యాలెట్ యాప్స్‌లోకి బదిలీ చేస్తున్నారు. తక్కువ మొత్తం కావడంతో గేట్‌వే క్షణాల్లో నగదు బదిలీ చేస్తోంది. మోసం గుర్తించి ప్రతి ఈ-వ్యాలెట్ యాప్‌లకు చెప్పేలోపే... లక్షల్లో నగదు నేరస్థుల ఖాతాల్లోకి వెళ్తోంది.
'రాజరాజచోర' సినిమా స్టైల్లో చోరీలు.. గజదొంగలకు బెయిల్ ఇప్పించి మరీ..!
భార్య, కొడుకుని చంపి.. బంధువులకు వాట్సప్‌లో ఫొటోలు షేర్ చేసి..