Fake Emails: సైబర్ కేటుగాళ్లు.. కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులు తాము మోసపోయామని తెలుసుకునే లోపే.. నష్టం జరిగిపోతోంది. ‘‘మూర్తీ... అర్జెంట్‌గా నీ వాట్సాప్ నంబర్ పంపించు.. ఒక సంక్షిప్త సందేశం పంపుతున్నా.. నేను ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నా.. బెంగుళూరులో మా బంధువులబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు. నేను పంపించిన బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు బదిలీ చేయి... మీటింగ్ పూర్తి కాగానే ఆఫీస్‌కు వచ్చి నీ ఫోన్‌పే లేదా గూగుల్‌పేకు నగదు బదిలీ చేస్తా.. సెల్‌ఫోన్లు మాట్లాడకూడదంటూ మీటింగ్‌లో చెప్పారు. అందుకే నాకు ఫోన్ చేయకు.. సరేనా.’’ హైదరాబాద్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఉపకులపతి మెయిల్ ఐడీతో గ్రంథాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి వచ్చిన సందేశమిది.
నకిలీ మొయిల్స్తో...
ఉన్నతాధికారి పరిస్థితి ఇబ్బందిగా ఉందని గ్రహించిన ఉద్యోగి... రెండో ఆలోచన లేకుండా లక్ష రూపాయల నగదు బదిలీ చేశారు. ఉపకులపతి కార్యాలయానికి రాగానే.. మీరు చెప్పినట్టు లక్ష రూపాయలు పంపించాను సార్.. అన్నాడు ఉద్యోగి. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఉపకులపతి... తాను మెయిల్ చేయలేదని చెప్పగా.. మోసపోయానని గ్రహించిన గ్రంథాలయ ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఒక్కటే కాదు.. వర్సీటీ వీసీలు, ఉన్నతాధికారుల మెయిల్స్‌తో, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కార్పొరేట్, ఐటీ సంస్థల సీఈఓల నకిలీ మెయిల్స్‌తో... సైబర్ నేరస్థులు మోసం చేస్తున్నారు.
అక్షరం అటు ఇటు మార్చి...
విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఫ్రొఫెసర్లు, ఇతర ఉన్నతాధికారులు, ఐటీ, కార్పొరేట్ సంస్థల మెయిల్ అడ్రస్‌లను సైబర్ నేరస్థులు ఆయా వర్సీటీలు, కార్పొరేట్, ఐటీ కంపెనీల వెబ్‌సైట్ల నుంచి తీసుకుంటున్నారు. ఉపకులపతులు.. సీఈఓల మెయిల్ ఐడీల్లో ఒక అక్షరం అటూ ఇటూ మార్చి కిందిస్థాయి ఉద్యోగులకు మెయిల్ పంపుతున్నారు. హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల మెయిల్ అకౌంట్, వాట్సాప్ డీపీలతో సైబర్ నేరస్థులు మోసాలు చేశారు.
ఈ తరహాలన్నీ వారి పనే..
ఒక విశ్వవిద్యాలయం ఉపకులపతి పేరుతో ఆరుగురికి మెయిల్స్ పంపించగా.. నలుగురు నగదు బదిలీ చేసేప్పుడు ఉపకులపతి కార్యాలయానికి వారు ఫోన్ చేసి మోసమని తేలడంతో మిన్నకున్నారు. మిగిలిన ఇద్దరూ 50వేల రూపాయల చొప్పున నగదు బదిలీ చేశారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లో ప్రస్తుతం ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరహా నేరాలన్నింటినీ నైజీరియన్లు చేస్తున్నారని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ఇదీచూడండి: CYBER CRIME: 'అధిక ఆదాయం ఆశచూపి.. నిండా ముంచేశారు'