Cyber crime in Rachakonda: యువతి పేరిట వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.18 లక్షలు కాజేశారు. డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో కేసు నమోదు కాకుండా ఉండాలంటే.. తమ రహస్య ఒప్పందం చేసుకోవాలంటూ నమ్మించి ఖాతా ఖాళీ చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు.. ఎల్బీనగర్‌కు చెందిన యువతి ఐటీ సంస్థలో పనిచేస్తోంది. గత నెలలో ఆమెకు కస్టమ్స్ అధికారులమంటూ సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు.
ఆమె పేరుతో వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని.. కేసు నమోదవుతోందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి.. ఎఫ్‌ఐఆర్ కావొద్దంటే సీబీఐ అధికారులతో మాట్లాడి రహస్య ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ఇంకో నంబరు నుంచి మరో వ్యక్తి యువతికి ఫోన్ చేశాడు. తాను సీబీఐలో పనిచేస్తానని.. డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో కేసు కాకుండా తమతో ఒప్పందం చేసుకోవాలని, ఇందుకు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.
సీబీఐ అధికారి పేరుతో ఒక ఐడీ కార్డు, ఒప్పంద పత్రాన్ని యువతి వాట్సప్‌నకు పంపాడు. అప్పటికే భయపడిన యువతి రెండు విడతల్లో రూ.5 లక్షలు పంపింది. యువతి చేస్తున్న లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో బ్యాంకు ప్రతినిధులు ఆమె ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేశారు. డబ్బు పంపడం సాధ్యం కాకపోవడంతో సైబర్ నేరగాళ్లు యువతితో ఖాతాను అన్ బ్లాక్ చేయించి మరీ.. మరో రూ.13 లక్షలు వసూలు చేశారు. ఇలా 6 గంటల వ్యవధిలో మొత్తం రూ.18 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బు పంపాలని కోరడంతో యువతి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: