Cyber Cheaters: స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నారు. తమకున్న దొంగతెలివితో జనాలను బురిడీ కొట్టిస్తూ క్షణాల్లో కోట్లు కొట్టేస్తున్నారు. క్రెడిట్ కార్డు కావాలంటూ ఒకరు ఫోన్ చేస్తారు. మీ బ్యాంక్ ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ మరొకరు మెసేజ్ పంపిస్తారు. లక్కీ డ్రాలో మీ నంబర్ బహుమతి గెలుచుకుందంటూ ఇంకో ఫోన్. ఇలా తెల్లవారు లేచిన దగ్గరి నుంచి రకరకాల ఫోన్ కాల్స్. ఇలాంటి మాటలను నమ్మి ఎంతో మంది మోసపోతున్నారు. వారు కష్టపడి సంపాదించిన సొమ్మంతా సైబర్ కేటుగాళ్ల చేతిలో పెడుతున్నారు.
సైబర్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక కేంద్రం
Specialized Center for Cyber Complaints: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌నేరాలపై ఫిర్యాదులు తీసుకునేందుకు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ , మేనేజ్‌మెంట్ సిస్టమ్(సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్) ఏర్పాటు చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండే కేంద్రం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సైబర్ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ కేంద్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజూ 70 వరకూ ఫిర్యాదులు వస్తుంటాయి. సమాచారం, కేసు పురోగతి వివరాలు తెలుసుకునేందుకు 800 మంది వరకూ ఫోన్ చేస్తుంటారని అంచనా. సైబర్ మోసగాళ్ల బారినపడుతున్న వారిలో గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్‌కు చెందిన వారే అధికంగా ఉండటం విశేషం. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది నవంబర్ చివరి వరకూ సైబర్‌నేరాలపై 5000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. 3854 కేసులు నమోదయ్యాయి. మోసగాళ్ల బారినపడిన బాధితులు రూ.57కోట్ల వరకూ నగదు కోల్పోయారు. దీనిలో ఇప్పటి వరకూ 587 కేసులను ఛేదించిన పోలీసులు పోగొట్టుకున్న సొత్తులో 5శాతం రికవరీ చేయగలిగారు.
నేరగాళ్లుగా అవతారమెత్తుతున్న కుర్రకారు..
Cyber cheaters: రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, దిల్లీ, ముంబయి, నోయిడా వంటి చోట్ల ఉన్నత చదువులు పూర్తిచేసిన విద్యావంతులు.. పల్లెల్లో అరకొర చదువులతో కూలీనాలీ చేసుకునే కుర్రకారు సైబర్ నేరగాళ్లుగా అవతారమెత్తుతున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉండి విద్యావంతులు, ఐటీనిపుణులు, ఉద్యోగులను తేలికగా మోసం చేస్తున్నారు. వీరి బారినుంచి బయటపడాలంటే అవగాహన, మోసపోయినట్టు గ్రహించిన 24 గంటల్లోపు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.
మొబైల్ గేమింగ్‌లోకి చొరబడుతున్నారు..
Cyber fraud in mobile games: కాస్త సమయం దొరికితే చాలు పిల్లలు, పెద్దలు సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకుంటున్నారు. మొబైల్ గేమ్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. సరదాగా ప్రారంభించి బానిసలుగా మారుతున్నారు. వార్, అడ్వంచర్ వంటి అంశాలున్న గేమ్స్‌లో ఒక్కో స్టేజ్ దాటేందుకు నిర్దేశించిన ఛార్జీలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలనే నిబంధన ఉంది. దీన్ని అవకాశంగా చేసుకున్న కొన్ని గేమింగ్ సంస్థలు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. మరోవైపు మొబైల్ గేమింగ్‌లోకి సైబర్‌మాయగాళ్లు చొరబడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మంతా స్వాహా చేస్తున్నారు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి కొద్దిరోజులుగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. కుటుంబ సభ్యుల నిఘా లేకపోవటంతో గేమ్‌లో ఆయుధాలు కొనేందుకు ఏకంగా రూ.2.5లక్షలు తండ్రి ఖాతా నుంచి సంబంధిత గేమింగ్ సంస్థకు మళ్లించాడు. అతడో ఐటీ ఉద్యోగి విరామ సమయంలో సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడటం ప్రారంభించాడు. దానికి అనుసంధానంగా వచ్చిన లింక్‌ను క్లిక్ చేశాడు.. అంతే క్షణాల్లో జీతం డబ్బులన్నీ మాయమయ్యాయి. తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొబైల్ గేమింగ్‌తో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నట్టు తాజాగా 9-10 మంది ఫిర్యాదు చేశారు. వీరిలో పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టు సైబర్‌క్రైమ్ ఏసీపీ జి.శ్రీధర్ తెలిపారు.
గుట్టు బయటపడిందిలా..
Cyber criminals fraud: ఐదు నెలల క్రితం మైలార్‌దేవ్‌పల్లిలో ఉంటున్న రిటైర్డ్ ఎస్సై అస్గర్ అలీ ఖాతా నుంచి రూ.11లక్షలు మాయమయ్యాయి. ఆన్‌లైన్ తరగతుల కోసం మనుమడికి సెల్‌ఫోన్ చేతికివ్వటమే కారణమని గుర్తించారు. ఈ విద్యార్థి(11) ప్రీఫైర్ గేమ్ ఆడుతుంటాడు. ఆ ఆటలో అదనంగా డబ్బు చెల్లిస్తే అదనంగా ఆయుధాలు ఇస్తుంటారు. వాటి ఆధారంగా ఒక్కో స్టేజ్ దాటుకుని వెళ్లేవాడు. దీనికోసం మధ్యమధ్యలో నోటిఫికేషన్‌లు వస్తుంటాయి. వాటిలో ‘'ఎస్'’ అని క్లిక్ చేస్తే నగదు చెల్లించేందుకు ఆమోదం తెలిపినట్టు.. ‘నో’ అని క్లిక్ చేస్తే తిరస్కరించినట్టు. ఇక్కడే సైబర్‌మాయగాడు సాఫ్ట్‌వేర్‌ను మార్చాడు. నో అని క్లిక్‌చేస్తే మొబైల్ ఫోన్‌కు అనుసంధానంగా ఉన్న బ్యాంకు ఖాతా నుంచి నగదు తమ ఖాతాలోకి చేరేలా మార్పులు చేశాడు. అలా దఫాల వారీగా రూ.11 లక్షలు కొట్టేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తులో మొబైల్ గేమింగ్ సంస్థ మలేషియాకు చెందినదిగా గుర్తించారు. ముంబయిలో ఉన్న ఏజెంట్ దాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్ధారించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడి బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి నగదును గుర్తించారు. ఖాతాను ఫ్రీజ్ చేశారు. డబ్బులు తీసుకునే అవకాశం లేకపోవటంతో ఉక్కిరిబిక్కిరైన నిందితుడు సైబర్‌క్రైమ్ పోలీసుల దారిలోకి వచ్చాడు. అస్గర్ అలీ పొగొట్టుకున్న రూ.11లక్షలు వెనక్కి తిరిగి ఇప్పించారు. ఇదే తరహా కేసులో మరో ఇద్దరి నిందితులను కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
విదేశీ కంపెనీలు.. ముంబయిలో ఏజెంట్లు
Cyber cheaters in online games: కత్తులు, తుపాకులు, ఫిరంగులు వీటితో యుద్ధం చేస్తూ శత్రువులపై పైచేయి సాధించే వీరుడు. అక్కడ యుద్ధవీరుడు తామేనంటూ ఊహించుకుని మొబైల్ గేమింగ్‌కు పిల్లలు అలవాటు పడుతున్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ తరగతులతో పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు చేరాయి. సమయం చిక్కినప్పుడల్లా విద్యార్థులు మొబైల్ గేమ్స్‌తో గడపటం పెరిగింది. ఆయుధాలు కొనుగోలు, పోటీల పేరుతో మొబైల్ గేమింగ్ సంస్థలు ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. యూపీఐ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఛార్జీలను చెల్లించేందుకు ఒక్కసారి ఆమోదం తెలిపితే చాలు. లావాదేవీలు జరిగిన ప్రతిసారీ బ్యాంకు ఖాతాలో నగదు వారి ఖాతాలోకి చేరుతుంటుంది. మొబైల్ గేమింగ్‌లో పాల్గొని విజేతలుగా నిలిచారంటూ రూ.10,000 చెల్లిస్తే రూ.20,000. రూ.లక్షకు రూ.2లక్షలు గెలుచుకున్నారంటూ సందేశాలు పంపుతారు. బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు చూపుతారు. ఖాతా పరిశీలిస్తేగానీ వాస్తవం గుర్తించలేరు. అప్పటికే గేమింగ్ యాప్‌ను తొలగిస్తారు. మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు చెందిన గేమింగ్ సంస్థలు నిర్వహణను ముంబయిలోని ఏజెంట్లకు అప్పగిస్తున్నాయి. వీరు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేయించి మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్ విభాగాన్ని ప్రత్యేక కేంద్రంగా..
15 రోజులకోసారి సైబర్‌నేరాలపై సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహిస్తున్నారు. వారానికోసారి నేరవిభాగ డీసీపీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కేసుల పురోగతిని తెలుసుకుంటూ సొమ్ము రికవరీ చేసేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రజల సహకారం, అవగాహనతో సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బ్యాంకింగ్, మొబైల్‌గేమింగ్ వంటి వాటిలో మోసపోయినట్టు గుర్తించగానే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 24 గంటల్లోపు ఫిర్యాదు చేయటం వల్ల నిందితుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి నగదు రికవరీ చేసేందుకు వీలుందన్నారు. సైబరాబాద్ సైబర్ విభాగాన్ని ప్రత్యేక కేంద్రంగా రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
జాగ్రత్తగా ఉండాలి..
'మొబైల్‌గేమింగ్ జాగ్రత్తగా ఉండాలి. వినోదం వెనుక ఉన్న ప్రమాదాన్ని గుర్తించి నడచుకోవాలి. పిల్లల చేతికి మొబైల్ ఇచ్చినపుడు తరచూ గమనిస్తుండాలి. మొబైల్ గేమింగ్‌లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ఛార్జీలు చెల్లించేందుకు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్‌కార్డు వివరాలు ఇస్తుంటారు. ఒక్కసారి లావాదేవి నిర్వహించినా ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగే అవకాశం ఉంది. దీనివల్లనే ఖాతాలో ఉన్న సైబర్ నేరస్థులు తేలికగా కొట్టేస్తున్నారు. సమస్యను అధిగమించేందుకు ఎనీడెస్క్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు, లింక్‌లు క్లిక్ చేయవద్దు. ప్రమాదకరంగా అనిపించినపుడు యాప్‌లను బ్లాక్ చేయండి. పిల్లలు గేమింగ్ నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించాలి. ఔట్‌డోర్ గేమ్ అలవాటు చేయాలి. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేయగానే ఖాతా నంబరు, ఓటీపీలు చెప్పవద్దు. సైబర్‌మోసానికి గురైనట్టు గుర్తించగానే 155260 నంబరుకు ఫోన్ చేసి చెప్పండి. సకాలంలో ఆయా బ్యాంకులకు సమాచారం ఇవ్వటం ద్వారా ఖాతాలను ఫ్రీజ్ చేస్తారు. నగదు రికవరీ చేయవచ్చు.' -జి.శ్రీధర్, ఏసీపీ సైబర్‌క్రైమ్, సైబరాబాద్
ఏటేటా పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. నేర పరిశోధన, సొమ్ము రికవరీలో సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది.
ఇదీ చదవండి: