Fake job racket Hyderabad: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.5.7లక్షలు, ల్యాప్‌టాప్, ప్రింటర్‌తో పాటు... నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
బెయిల్ మీద వచ్చి...
నల్గొండకు చెందిన వర కుమార్... కర్మన్ ఘాట్‌లో నివాసం ఉంటున్నారు. కంప్యూటర్‌పై పట్టు ఉండటంతో నకిలీ నియామక ధ్రువపత్రాలు రూపొందించి... మోసం చేసిన కేసులో సరూర్‌నగర్ పోలీసులు గతంలో వర కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బెయిల్ పై బయటికి వచ్చిన వరకుమార్... ప్రవర్తన మార్చుకోకుండా మరోసారి అలాంటి మోసానికే పాల్పడ్డారని వెల్లడించారు.
జైల్లో పరిచయమైన వ్యక్తులతో కలిసి..
వర కుమార్.. జైల్లో పరిచయమైన మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడి ఉద్యోగాలిస్తామంటూ పలువురిని మోసం చేశారని సీపీ తెలిపారు. పొరుగు సేవల విధానంలో పలు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దాదాపు రూ.23 లక్షలు వసూలు చేశారని వెల్లడించారు. డబ్బులిచ్చిన నిరుద్యోగులు నకిలీ నియామక పత్రాల గురించి తెలుసుకొని మోసపోయామని గ్రహించి... హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు.
నిందితుల నుంచి రూ.5,70,000తోపాటు నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంప్‌లు, ప్రింటర్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు నిరుద్యోగుల నుంచి రూ.23 లక్షలకు పైగా వసూలు చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోకూడదు. ఇలాంటి మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి.
-మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
ఇదీ చదవండి: Gajularamaram student suicide case: విద్యార్థి అదృశ్యం విషాదాంతం.. ఇష్టంలేని కోర్సులో చేర్పించారనేనా?