ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ వేసిన నార్కో పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతించాలని సీబీఐ వేసిన పిటిషన్‌పై.. జమ్మలమడుగు కోర్టు మేజిస్ట్రేట్ విచారణ జరిపింది. కడప జైలు నుంచి వర్చువల్‌గా సునీల్ యాదవ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నార్కో పరీక్షలకు సమ్మతమేనా అని మేజిస్ట్రేట్.. సునీల్‌ను ప్రశ్నించింది. ఇందుకు బదులుగా తాను నార్కో పరీక్షలకు సమ్మతం కాదని సునీల్ యాదవ్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. సీబీఐ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.
సీబీఐ పిటిషన్ ఏంటంటే..?
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను కీలక వ్యక్తిగా భావిస్తోంది సీబీఐ. అతడిని విచారిస్తే అసలు విషయం బయటికి వస్తుందని భావించిన అధికారులు.. ఆగస్టు 18వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీల్‌కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. ఆగస్టు 27న మరోసారి వాదనలు విన్న కోర్టు... సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సీబీఐ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
గోవాలో అరెస్ట్..
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆగస్టు 2న గోవాలో సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది. ఈనెల 3న సునీల్‌ను గోవా స్థానిక కోర్టులో హజరుపరిచిన సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్‌లోకి తీసుకున్నారు. అనంతరం కడప కోర్టులో హాజరుపరిచిన అధికారులు.. జైలుకు తరలించారు.
సీబీఐపై సునీల్ కుటుంబ సభ్యుల ఆరోపణలు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన కుమారుడి ప్రమేయం లేకపోయినా సీబీఐ అధికారులు కావాలనే ఇరికించారని సునీల్ యాదవ్ తల్లి సావిత్రి, భార్య లక్ష్మి ఆరోపించారు. సీబీఐ అధికారులు తమ కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్‌ను సీబీఐ అధికారులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. హత్య కేసు ఒప్పుకోవాలని సునీల్ స్నేహితుడు ఒత్తిడి చేయటంతో గత్యంతరం లేక గోవా పారిపోయాడన్నారు. వైఎస్ కుటుంబం అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని.. కొందరు వ్యక్తులు కావాలనే తమ కుమారుడిని ఇరికిస్తున్నారని సావిత్రి వాపోయారు. దస్తగిరి, ఉమా శంకర్ ద్వారానే సునీల్‌కు వివేకానందరెడ్డి పరిచయం అయ్యారు కానీ.. హత్య కేసుతో సంబంధం లేదన్నారు. వివేకాను హత్య చేసిందెవరో సీబీఐకి తెలుసునని సునీల్ భార్య లక్ష్మీ ఆరోపించారు.
గతంలోనే కోర్టున ఆశ్రయించిన సునీల్ యాదవ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తమను సీబీఐ వేధిస్తోందని కడప జిల్లా మోతునూతలపల్లికి చెందిన యదాతి సునీల్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం దిల్లీకి పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. అనుమతి లేకుండా లై డిటెక్టర్ వినియోగించారన్నారు. అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు.
ఇదీ చదవండి : Rajath kumar: 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు