హైదరాబాద్ సోమాజిగూడలోని కంట్రీక్లబ్ ఆవరణలో కొనసాగుతున్న మూడు పబ్‌లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి యువతులను పబ్‌లకు ఆహ్వానించడమే కాకుండా... వారితో అసభ్యంగా వ్యవహరించడాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు స్పందించి ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
నిత్యం ఘర్షణలు
నిత్యం ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పలుమార్లు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఓ జంట పబ్‌కు రాగా... కొందరు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని వివరించారు. సదరు వ్యక్తులపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బయలుదేరిన వారిని.. పబ్ నిర్వాహకులు అడ్డుకోవడమే కాకుండా దాడికి దిగినట్లు చెప్పారు. ఘటనలో యువతికి స్వల్ప గాయాలు కాగా... యువకుడి పరిస్థితి విషమంగా మారిందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుడు మురళీ కృష్ణతో పాటు పలువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సీఎం క్యాంప్ కార్యాలయానికి సమీపంలో
అటు సీఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ పబ్‌లు ఉండటం గమనార్హం. స్థానికులు పబ్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. వీటన్నింటిని పరిశీలించిన రెవెన్యూ ఉన్నతాధికారులు మంగళవారం పబ్‌లను సీజ్ చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు
ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నయాన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు నిర్వాహకుడు, ప్రధాన నిందితుడిగా ఉన్నమురళిపై మరోసారి కేసులు నమోదు చేయగా... అతను పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని సీఐ వివరించారు. మరోవైపు పబ్‌లకు సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరుకు రెవెన్యూ అధికారులతో కలిసి సీజ్ చేశామని పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: Saidabad rape case: హత్యాచార నిందితుడు రాజును పట్టిస్తే రూ. 10 లక్షలు