పాఠశాలలో సామాగ్రిని కొందరు దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రభుత్వ పాఠశాల తాళాలు పగలగొట్టి రూ.3 లక్షల విలువైన సామాగ్రిని తస్కరించారు. రెండు గదుల్లోని రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు , ప్రొజెక్టర్ , సౌండ్ సిస్టమ్ చోరీ చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది.
కాపలాదారునిగా పనిచేస్తున్న అనిల్ గౌడ్ ఈరోజు ఉదయం పాఠశాలకు వచ్చి చూడగా రెండు గదుల తాళాలు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ప్రధానోపాధ్యాయుడు పోచయ్యకు తెలియజేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మందమర్రి సీఐ ప్రమోద్ రావు, ఎస్సై సంజీవ్ పాఠశాలను పరిశీలించారు.
ఇదిలా ఉంటే గత ఆరు నెలలుగా గ్రామాల్లో చోరీలు ఎక్కువ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్ల బ్యాటరీలు, మోటార్లను ఎత్తుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.