Child Dead: హైదరాబాద్లోని లక్డికాపూల్ ప్రాంతంలో ఉన్న ఓ పిల్లల ఆసుపత్రిలో పాప మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మునుగు జిల్లా గోవిందరావు పేట మండలానికి చెందిన మనోజ్ఞ(5ఏళ్లు) అనే పాపకు వైరల్ ఫీవర్ రావడంతో ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ తీసుకొచ్చి లోటస్ ఆసుపత్రిలో తల్లిదండ్రులు చేర్పించారు. మూడు లక్షల రూపాయలు కట్టిన తరవాతనే వైద్యులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారని పాప తల్లిదండ్రులు వాపోయారు. శనివారం రాత్రి చనిపోయిన తర్వాత కూడా తమకు చెప్పకుండా వైద్యులు ట్రీట్మెంట్ చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈరోజు పాప మృతి చెందిందని రూ.80వేలు ఇస్తేనే మృత దేహాన్ని ఇస్తామని లోటస్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా ఆసుపత్రి ముందు భారీగా బలగాలను మోహరించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. లోటస్ ఆసుపత్రి పై చర్యలు తీసుకొని తమకు తగిన న్యాయం చేయాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు.
తాము సక్రమంగానే చికిత్స చేశామని, వైద్య వృత్తిలో ఉండి ఏ మనిషిని చంపాలని చూడమని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పాప బంధువులు రాజకీయ పార్టీ నాయకులను తీసుకువచ్చి ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేసి, తమపై దాడికి యత్నించారని పేర్కొన్నారు. అంతేకాకుండా వారు చెల్లించిన మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు.
ఇవీ చదవండి: