మంచిర్యాల జిల్లాకు చెందిన 13 మంది సభ్యులు గల ముఠా.. గిప్ట్ వచ్చిందని ఆన్లైన్ వినియోగదారులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో.. మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు ఇప్ప రాజ్ కుమార్ ఆన్లైన్ ద్వారా గిఫ్ట్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు. మరో 12 మందిని చేర్చుకుని కలకత్తా నగరాన్ని స్థావరంగా మార్చుకుని అమాయకులకు ఎర వేస్తున్నట్లు వెల్లడించారు.
ఆన్లైన్ షాపింగ్ చేసిన వారి సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించి.. షాపింగ్ చేసినందుకు లక్కీ డ్రాలో కారు వచ్చిందని.. దీనికి కొంత డబ్బు చెల్లించి కారు తీసుకోవాలంటూ బూటకపు మాటలు చెప్పేవారని సీపీ అన్నారు. ఈ విధంగా ఈ ముఠా సభ్యులు రోజుకు 30 నుంచి 40 మందికి ఫోన్ చేసేవారని వివరించారు.
ఈ విధంగా మోసపోయిన ఆన్లైన్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరుణ్ జోషి అదేశాల మోరకు ఆధునిక పరిజ్ఞాన్ని వినియోగించుకుని నిందితుల కదలికలను గుర్తించి వరంగల్ రైల్వేష్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు.