ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్యకేసులో (viveka murder case) సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై పులివెందుల కోర్టులో విచారణ జరిగింది. మున్నాను పులివెందుల కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు.. నార్కో పరీక్షల కోసం పిటిషన్ వేశారు. నార్కో పరీక్షలకు మేజిస్ట్రేట్ ఎదుట మున్నా అంగీకారం తెలపడంతో.. సీబీఐకి పులివెందుల కోర్టు అనుమతిచ్చింది. గతేడాది మున్నాకు చెందిన రూ.50 లక్షలకు పైగా నగదును సీబీఐ అధికారులు గుర్తించారు.
112వ రోజు విచారణ
ఇక హత్య కేసులో సీబీఐ విచారణ 112వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు దస్తగిరి పని మానేశాడు. ఇతడు ఇచ్చిన కొన్ని కీలక ఆధారాలతో సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
మీడియా ప్రతినిధులకు నోటీసులు
ఈ కేసు విచారణలో భాగంగా మీడియా ప్రతినిధులకు సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. జులై 24న వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత పులివెందులలో (pulivendula) అతన్ని కొందరు మీడియా ఛానెల్స్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. సెల్ ఫోన్లో రంగన్న మాటలను రికార్డు చేసిన ఛానెల్స్‌కు సీబీఐ నోటీసులు(CBI Notices) పంపింది. ఆ రోజు రంగన్నను ఇంటర్వ్యూ చేసిన కడప, పులివెందుల రిపోర్టర్లను ఫుటేజీ తీసుకుని విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కడప కేంద్ర కారాగారం(kadapa central jail) అతిథి గృహంలో సీబీఐ అధికారుల ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మరో ఇద్దరు..
రెండు ఛానల్స్‌కు చెందిన మీడియా ప్రతినిధులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. రంగన్నను ఇంటర్వ్యూ చేసిందెవరు అనే దానిపై వారిని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. రంగన్నకు చెందిన ఫుటేజీ, డాక్యుమెంట్లు అందించి విచారణకు సహకరించాలని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో భాగంగా మరో ఇద్దరు అనుమానితులు సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి, పులివెందులకు చెందిన వెంకటనాథ్ రెడ్డిలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. నాలుగు రోజుల కస్టడీ అనంతరం ఉమాశంకర్ రెడ్డిని సోమవారం రోజు పులివెందుల కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: