Jubilee hills Gang rape case: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అత్యాచార ఘటనలో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు నిందితులు కూడా (ఒకరు తప్ప) మైనర్లే కావటంతో.. వాళ్ల పేర్లు, కుటుంబ వివరాలు, ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. వాళ్ల వివరాలను ఎవ్వరూ బహిర్గతం చేయొద్దని.. చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పలుమార్లు హెచ్చరించారు.
అదే సమయంలో.. ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు ఫొటోలు, వీడియోలు బయటపెట్టటంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనకు అవి ఎలా చేరాయన్న కోణంలోనూ దర్యాప్తు చేశారు. మరోవైపు.. పోలీసులు అంత గట్టిగా హెచ్చరించినా.. సామాజిక మాధ్యమాల్లో బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో అదే పనిగా ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వాళ్ల ఐపీ అడ్రస్ల ఆధారంగా.. నలుగురిని గుర్తించి పోలీసులు వాళ్లపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇంకెవరైనా.. బాధితురాలివి కానీ.. నిందితులవి కానీ.. ఎలాంటి వివరాలు వైరల్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి ఉంటే.. అన్నింటిని వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించారు. ఇదే విషయమై.. ఫేస్బుక్ లీగల్సెల్కు కూడా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు లేఖ రాశారు.
ఇవీ చూడండి: