ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో చీటీలు నిర్వహిస్తూ, అధిక వడ్డీలకు డిపాజిట్లు సేకరించి వందలాది మందిని మోసం చేసి పరారైన స్థానిక సత్యనారాయణపేటకు చెందిన విజయలక్ష్మిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫండ్ గ్రూప్ పేరుతో నిధులు సేకరించి కొంత కాలం డిపాజిట్‌దారులకు సక్రమంగా చెల్లిస్తూ తర్వాత మోసానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
‘చీటీలు, డిపాజిట్లతో రూ.45 కోట్లతో టోకరా’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైంది. బాధితులు పట్టణ రెండో పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తగిన ఆధారాలతో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. హిందూపురం, గోరంట్ల, పెనుకొండ, మడకశిర ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు డబ్బు కట్టించుకొన్న ఏజెంట్లను వెంట తీసుకొని వచ్చి అధికారుల ఎదుట తమ బాధను వెళ్లగక్కారు. ఎంతో మంది బాధితులు తమ పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు, పెళ్లిళ్ల కోసమని విజయలక్ష్మి వద్ద నగదు దాచుకోగా ఆమె పట్టణం వదిలి ఉడాయించిందని బోరుమన్నారు. సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ చీటీలు, డిపాజిట్ల పేరుతో మోసాలకు పాల్పడిన నిర్వాహకురాలిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు.
ఫండ్ గ్రూప్ నిధులు రూ.2 కోట్లు పక్కదారి
హిందూపురం పట్టణంలోని మేళాపురం, చౌడేశ్వరి కాలనీకి చెందిన పేద, మధ్య తరగతి మహిళలు ప్రతి వారం కొంత మొత్తాన్ని దాచుకొంటూ నగదు అవసరమైన వారికి తమ గ్రూపులోని సభ్యులకు వడ్డీకి రుణాలను ఇస్తూ వస్తున్నారు. ఐదేళ్లుగా వీరి గ్రూపు నడుస్తోంది. అయితే, రెండేళ్లుగా గ్రూపులో నిర్వాహకుల మధ్య విబేధాలు రావడం, అప్పుగా తీసుకొన్న వారు తిరిగి చెల్లించక పోవడంతో బకాయిలు, వడ్డీ పేరుకు పోయింది. దీంతో గ్రూపు నిర్వాహకులు పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి రుణాలు తీసుకొన్న వారిపై పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ మొత్తం రూ.2 కోట్ల వరకు చేరింది. నగదు జమ చేస్తూ వచ్చిన మహిళలకు తిరిగి చెల్లించక పోవడంతో మంగళవారం 50 మందికి పైగా బాధితులు నిర్వాహకులను వెంట తీసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. విషయాన్ని పట్టణ సీఐ బాల మద్దిలేటికి వివరించారు. అనధికారిక ఫైనాన్స్, ఫండ్‌లు నడపడం చట్ట విరుద్దమని బాధిత మహిళల వినతితో పూర్తి స్థాయిలో విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Lucky Draw Cheating : జోరుగా లక్కీడ్రా దందా.. ఆకర్షణీయమైన బ్రోచర్లతో వల