కొన్ని రకాల మోసాలను చూస్తుంటే... ఇలా కూడా చేస్తారా అని అనిపించక మానదు. అలాంటి కోవలోకే చెందుతుంది ఈ కార్ల స్కాం. హైదరాబాద్‌లో ఈ కొత్తరకం మోసం బయటపడింది. కార్లు కొనకపోయినా నకిలీ పత్రాలు సృష్టించి... బ్యాంకులకు టోకరా వేస్తున్న ఓ డీలర్ పోలీసులకు చిక్కాడు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.1.90 కోట్లు స్వాహా చేశాడు.
ఇదీ స్కాం సూత్రం
ద్విచక్ర వాహనాలు, కార్లు విక్రయిస్తున్న డీలర్లకు రవాణాశాఖ తాత్కాలిక నంబర్లు (టీఆర్ నంబర్లు) ఇస్తుంటుంది. వాహనం కొన్న వారు నెల రోజుల్లోపు సమీపంలోని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రవాణా శాఖ ఇస్తున్న తాత్కాలిక నంబర్లతోనే కార్ల డీలర్ మాయాజాలం ప్రదర్శించాడు. తనకు నచ్చిన నంబరు, వాహనం ఛాసిస్ నంబరును కొటేషన్‌లో నమోదు చేసి కారు ధరతో పాటు... బ్యాంకు అధికారులకు పంపిస్తున్నాడు. బ్యాంకు నుంచి లోన్ మంజూరు కాగానే... ఆ మొత్తాన్ని కార్ల డీలరు, మరో వ్యక్తి కలిసి పంచుకుంటున్నారు.
ఇలా దొరికారు
బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక రసాయన కంపెనీ సంచాలకులు కంపెనీ అవసరాల కోసం వోల్వో కారును కొనేందుకు కెనరా బ్యాంక్ సుల్తాన్ బజార్‌శాఖ అధికారులను మూడేళ్ల క్రితం సంప్రదించారు. టోలీచౌకిలోని కార్ డీలర్ వద్ద నుంచి వాహనం కొంటున్నామని.. రూ.95 లక్షలు రుణం కావాలని దరఖాస్తు చేశారు. బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేశారు. కిస్తీలు సక్రమంగా కట్టకపోవడంతో కెనరా బ్యాంక్ ప్రతినిధులు వారిని హెచ్చరించగా... దశల వారీగా రూ.50.49 లక్షల విలువైన చెక్కులు ఇచ్చారు. అవి చెల్లకపోవడం వల్ల బ్యాంక్ అధికారులు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది.
ఇంకా ఎన్నో..
బంజారాహిల్స్‌కు చెందిన ప్రదీప్... ద్విచక్ర వాహనాల కంపెనీ సీఈవోగా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఐడీబీఐ బ్యాంక్ ఇక్రిశాట్ శాఖకు వెళ్లి వోల్వోకారు కొనేందుకు రూ.85 లక్షల రుణం కావాలన్నాడు. వోల్వో కారు మోడల్.. నకిలీ టీఆర్ నంబర్‌ను సమర్పించాడు. 2018 నవంబరులో లోన్ మంజూరైంది. 2019 నవంబరు వరకు నెలనెలా కిస్తీలు చెల్లించిన ప్రదీప్‌రాజు తర్వాత చెల్లించలేదు. బ్యాంక్ అధికారులు చాలాసార్లు హెచ్చరించగా.. గతేడాది ఆగస్టులో రూ. 20.70 లక్షల చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు బ్యాంకులో సమర్పించగా... అది చెల్లుబాటు కాలేదు.
టోలీచౌకీలో ఉంటున్న కార్ల డీలర్ తనకే కారు కావాలంటూ బంజారాహిల్స్‌లోని ముత్తూట్ మనీ ఫైనాన్స్ సంస్థను మూడేళ్ల క్రితం సంప్రదించాడు. రూ.33 లక్షల రుణం కావాలంటూ తప్పుడు పత్రాలు సమర్పించాడు. ముత్తూట్ కంపెనీ ప్రతినిధులు రూ. 33 లక్షలు మంజూరు చేయగా... ఏడాది పాటు కిస్తీలు చెల్లించి తర్వాత కట్టలేదు. పలుమార్లు మూత్తూట్ మనీ ప్రతినిధులు అడిగినా రుణం తిరిగి చెల్లించకపోవడంతో కొద్దిరోజుల క్రితం వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: call rooting scam: హైటెక్ ‘కాల్ రూటింగ్’.. ముఠా గుట్టురట్టు