B.tech Student Suicide Bachupally : తాత్కాలిక సమస్యలకు చావే శాశ్వత పరిష్కారంగా భావించి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న కారణాలతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పరీక్షలో ఫెయిల్ అయ్యామని కొందరు.. లవ్ బ్రేకప్ అయిందని మరికొందరు ఇలా పలు కారణాలతో యువతే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతోంది.
Student Jumps off From Building : జీవితంపై విరక్తితోనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి హైదరాబాద్ బాచుపల్లి కళాశాల వసతిగృహంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం 13వ అంతస్తు నుంచి దూకి శివనాగులు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న శివనాగులు.. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
Student Suicide in Hyderabad : శివనాగులు కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని తరలించారని తోటి విద్యార్థులు, బంధువులు ఆరోపించారు. తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని.. సూసైడ్ నోట్లో రాసింది అతడు కాదని.. అది అతడి చేతిరాత కాదని మృతుడి తండ్రి సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా కళాశాల వద్ద ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా భాజపా, ఏబీవీపీ నేతలు నిరసన చేపట్టారు. కళాశాల యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ పూల కుండీలు ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో బాచుపల్లి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.